1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (18:41 IST)

అయోధ్యలో కాల్పులు కలకలం: వ్యక్తి మృతి.. ఇద్దరు బాలికలకు గాయం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు బాలికలు గాయపడ్డారు. బుధవారం రాత్రి అయోధ్యలోని కోర్ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపం వద్దకు నలుగురు వ్యక్తులు వాహనాల్లో వచ్చారు. పూజ మండపం వద్ద ఉన్న ఒక వ్యక్తిపై కాల్పులు జరిపారు. దాంతో అతను మృతి చెందాడు. 
 
అలాగే ఆయన కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు గాయపడ్డారు. తొలుత వారిని అయోధ్య జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించారు. అయితే కాల్పులు జరిపిన నలుగురిలో ఒకరిని అరెస్ట్‌ చేసినట్టు అయోధ్య పోలీసులు తెలిపారు. 
 
నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ముగ్గురిని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని ఎస్‌ఎస్‌పీ శైలేష్ పాండే చెప్పారు. దుర్గా పూజ నేపథ్యంలో ఈ కాల్పుల ఘటన జరిగినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. వ్యక్తిగత వివాదం వల్ల ఈ ఘటన జరిగిందని, కారణం ఏమిటన్నది తెలుసుకుంటున్నామని చెప్పారు.