1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 మే 2016 (09:20 IST)

ఉత్తరాఖండ్‌లో అగ్నిదావానలం... ఏడుగురు సజీవదహనం... మంటలను ఆర్పుతున్న హెలికాఫ్టర్లు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడవి తగలబడుతోంది. శనివారం రాజుకున్న అగ్గి.. ఏకంగా 2269 హెక్టార్ల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతాన్ని తగలబెట్టింది. ఇది 24 గంటల్లో నాలుగైదు రెట్లు పెరిగినట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తీసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది. ఇప్పుడు ఆ జ్వాలాగ్ని మొత్తం ఉత్తరాదికి విస్తరిస్తున్నట్లు హైదరాబాద్‌లోని ఇస్రో నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ విశ్లేషణల్లో తెలిసింది.
 
ఆదివారానికి దాదాపు 1300 ప్రాంతాలు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. ఇక ఆ మంటలను ఆర్పేందుకు భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. నైనిటాల్‌లో అక్కడి భిమ్తాల్‌ సరస్సు నుంచి నీటిని తెచ్చి హెలికాప్టర్లతో మంటలను ఆర్పుతున్నారు. పారీ, రుద్రప్రయాగ, తెహ్రీ, ఉత్తరకాశీ, అల్మోరా, పితోడ్‌గఢ్‌, నైనిటాల్‌, చమోలీల్లో మంటలను అర్పేందుకు గాను ఏకంగా ఆరు వేల మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఈ అగ్నికీలాల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనమయ్యారు.