1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (16:26 IST)

ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య రాజీనామా

Baby Mourya
ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. పదవీ కాలం పూర్తి కావడానికి రెండేళ్లకు ముందుగానే బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపారు. గవర్నర్ కార్యదర్శి బ్రిజేష్ కుమార్ సంత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 
 
1956లో జన్మించిన బేబీ రాణి మౌర్య, 2018 ఆగస్టులో ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాఖండ్‌ తొలి మహిళా గవర్నర్ మార్గరెట్ అల్వా తర్వాత ఆ రాష్ట్రానికి రెండో మహిళా గవర్నర్‌గా ఆమె వ్యవహరించారు.
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బేబీ రాణి మౌర్య, ఉత్తరాఖండ్ గవర్నర్ కావడానికి ముందు అనేక రాజకీయ, పరిపాలనా పదవులలో పనిచేశారు. 1995 నుండి 2000 వరకు ఆగ్రా మేయర్‌గా ఉన్నారు. 
 
2001లో యూపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలుగా, 2002లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా పని చేశారు. 1996లో ఆమెకు సమాజ్ రత్న, 1997లో ఉత్తర ప్రదేశ్ రత్న, 1998లో నారి రత్న అవార్డులు లభించాయి.
 
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దళిత వర్గానికి చెందిన బీజేపీ నాయకురాలు బేబీ రాణి మౌర్యకు కీలక బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తుంది. 2007లో ఎత్మాద్‌పూర్‌ నుంచి పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. అనంతరం కొంతకాలం క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.