గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (09:48 IST)

నేడు ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్... సాయంత్రానికే ఫలితాలు : గెలుపు ఏకపక్షమేనా?

దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం పోలింగ్ జరుగనుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. దీంతో కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోడానికి ఈ ఎన్నికల పోలిం

దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం పోలింగ్ జరుగనుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. దీంతో కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోడానికి ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటర్లుగా ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్‌లోని 62వ రూమ్‌లో పోలింగ్ జరుగనుంది. రాత్రి ఏడు గంటలలోపు ఫలితాలు వెల్లడికానున్నాయి. 
 
కాగా, ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే మద్దతుతో బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాల మద్దతుతో మహాత్మాగాంధీ మనుమడు గోపాల్‌గాంధీలు పోటీలో ఉన్నారు. పార్లమెంట్ ఉభయసభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యుల సంఖ్య నామినేటెడ్ సభ్యులతో కలిపి మొత్తం 790గా ఉంది. అయితే ప్రస్తుతం వీటిలో రెండు లోక్‌సభ సీట్లు, ఒక రాజ్యసభ స్థానం ఖాళీగా ఉన్నాయి. 
 
పార్లమెంట్ ఉభయసభల్లో కలిపి ఎన్డీయేకు తగినంత బలం ఉంది. 545 సీట్లున్న లోక్‌సభలో 281 మంది బీజేపీ సభ్యులతో పాటు ఎన్డీయే కూటమికి ఏకంగా 338 మంది సభ్యులున్నారు. రాజ్యసభలో 243 మంది సభ్యుల్లో ప్రస్తుతం బీజేపీకి కేవలం 58 మంది ఎంపీలు ఉండగా ఎన్డీఏ కూటమి పార్టీల సభ్యులతో కలిపితే సుమారు 100వరకు ఉంటుంది. కాంగ్రెస్‌కు 57 మంది ఉండగా కూటమి పార్టీలతో పాటు ఎన్సీపీ, జేడీయూ, బిజూ జనతాదళ్ తదితర పార్టీల మద్దతు కూడా ఉంది. కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలకు ఉభయసభల్లో ఉన్న సభ్యులను కలిపినా మెజారిటీ లేదు కాబట్టి ఈ పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న గోపాల్‌కృష్ణగాంధీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప గెలిచే అవకాశాలు లేవు. 
 
అయితే, ఉభయసభల్లోని బలాబలాలను కలుపుకుంటే మొత్తం 788 మంది ఎంపీల్లో మెజారిటీ సభ్యుల బలం ఎన్డీఏ అభ్యర్థికే ఉన్నందువల్ల ఎన్డీయే అభ్యర్థిగా ఉన్న వెంకయ్య నాయుడి గెలుపు దాదాపుగా ఖరారైనట్లే. పోలైన ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థి గెలుపొందినట్లవుతుంది. అంటే, 395 ఓట్లు లభించిన అభ్యర్థి గెలుపొందుతారు. కానీ బీజేపీకి ఒక్క లోక్‌సభలోనే 338, రాజ్యసభలో 100 ఓట్లు పడనున్నాయి. దీంతో వెంకయ్య గెలుపు కేవలం లాంఛనప్రాయమే.