డీఎంకే విజయం కోసం హీరో విజయ్ రహస్య అజెండా : కె.అన్నామలై
తమిళనాడు అసెంబ్లీకి వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికార డీఎంకే మళ్లీ అధికారంలోకి రావాలన్న రహస్య అజెండాతో సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ పని చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె.అన్నామలై ఆరోపించారు. విజయ్ వర్క్ ప్రమ్ హోం పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. విజయ్‌కు ఐదు పదుల వయసు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని అనిపించిందా? అని ఆయన ప్రశ్నించారు. 30 యేళ్ల వయసులో విజయ్ ఎక్కడున్నారంటూ ఆయన నిలదీశారు.
డ్రామాలు ఆడుతున్నది బీజేపీ కాదని విజయ్ అని చెప్పారు. డీఎంకే పార్టీకి విజయ్ పార్టీ బి టీమ్ అని విమర్శించారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి రావాలన్న రహస్య అజెండాలో భాగంగా విజయ్ టీవీకే పార్టీ పని చేస్తుందని అన్నారు.
విజయ్ పరిధిదాటి మాట్లాడేముందు ఆలోచన చేయాలన్నారు. విజయ్‌కి చేతనైతే ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలని, షూటింగులు చేస్తూ ఓ లెటర్ రాసి పంపడం రాజకీయం కాదని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల గురించి విజయ్‌కు ఏమి తెలుసని, ఎలాంటి అవగాహన ఉందని అన్నామలై ప్రశ్నించారు.