చెన్నైలో శశికళతో రహస్యంగా భేటీ అయిన విజయశాంతి!
అన్నాడీఎంకే బహిష్కృత మహిళానేత శశికళతో సినీ నటి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా నేత విజయశాంతి రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ తాజా రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం.
గత 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిపోయిన వారిని తిరిగి సొంత పార్టీలో చేర్పించే యత్నాల్లో బీజేపీ ఉందని, అందులోభాగంగానే శశికళతో విజయశాంతి రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలావుంటే, అక్రమార్జన కేసులో జైలు శిక్షను అనుభవించిన శశికళ గత యేడాది జైలు నుంచి విడుదలయ్యారు. అపుడు శశికళను విజయశాంతి కలుసుకున్నారు. ఇపుడు మరోమారు భేటీకావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలావుంటే, జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఇకపై ఆధ్యాత్మిక జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్టు అప్పట్లో శశికళ ప్రకటించారు. అందులోభాగంగానే ఆమె ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో నిమగ్నమైవున్నారు.
అయితే, ఆమెను కలిసిన మద్దతుదారుల విజ్ఞప్తి, ఒత్తిడి మేరకు ఆమె తన మనస్సు మార్చుకుని, రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో పార్టీని తిరిగి గాడినపెట్టి, రాష్ట్రంలో మళ్లీ అన్నాడీఎంకే పాలనను తీసుకొచ్చే దిశగా శశికళ వ్యూహాలు రచిస్తున్నారు. అలాటి తరుణంలో శశికళతో రాములమ్మ భేటీ కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.