శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అన్నాడీఎంకే గూటికి శశికళ : దినకర్ పార్టీ కూడా విలీనం??

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళ తిరిగి అన్నాడీఎంకే గూటికి చేరనున్నారు. ఈ మేరకు అన్నాడీఎంకేలోని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సమన్వయకర్త ఓ.పన్నీర్ సెల్వం వర్గం శశికళను పార్టీలో తిరిగి చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే అంశంపై ఓపీఎస్ వర్గం శుక్రవారం ఓ తీర్మానం చేసి, పార్టీ అధిష్టానానికి పంపనున్నారు. 
 
ఆ తర్వాత ఓపీఎస్, మరో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి, పార్టీ సర్వసభ్య సమావేశమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, శశికళ చేరికను ఈపీఎస్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరోవైపు, అన్నాడీఎంకే శశికళను చేర్చుకుంటే తన పార్టీని అన్నాడీఎంకే విలీనం చేసే అంశాన్ని పరిశీస్తామని శశికళ బంధువు, అమ్మా మక్కల్ మున్నేట్ర కళకం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రకటించారు. 
 
గత అసెంబ్లీ ఎన్నికలతో ఇటీవల జరిగిన నగర పంచాయితీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి దారుణ ఓటములు భవిష్యత్‌లో మరోమారు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా, పార్టీని గాడిలో పెట్టాలంటే పార్టీ నాయకత్వ బాధ్యతలను శశికళకు అప్పగించడం మేలన్నఅభిప్రాయాన్ని ఇటు నేతలు, అటు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తేని జిల్లా పెరియకుళం కైలాసపట్లిలోని ఓపీఎస్ ఫాంహౌస్‌లో బుధవారం ఓపీఎస్ వర్గం నేతలు సమాశమై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు.