సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 మార్చి 2022 (09:21 IST)

కాంగ్రెస్ ముక్త్ భారత్‌కు శ్రీకారం : విజయశాంతి

కాంగ్రెస్ ముక్త్ భారత్‌కు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ మన దేశానికి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి లభించనుందని జోస్యం చెప్పారు. 
 
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షణలోని బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో ప్రజల హృదయాలలో బీజేపీ, ప్రధాని మోడీ చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. 
 
ప్రతిపక్ష నేతలంతా కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ బీజేపీపై పగబట్టినట్టుగా ప్రచారంతో పాటు దుష్ప్రచారం చేశారని, కానీ, ఓటర్లు విజ్ఞతతో తీర్పునిచ్చారని, ఈ తీర్పుతో ప్రతిపక్షాలకు నిరాశ తప్పలేదన్నారు. 
 
మరీ ముఖ్యంగా... వైరి పక్షాలన్నీ బూచిగా చూపిన వ్యవసాయ చట్టాల ప్రభావం ఏమీ లేదని తేలిపోయిందని విజయశాంతి అన్నారు. బీజేపీపై ఎన్ని కట్టుకథలు అల్లినా నిజమేంటో ఓటర్లు గ్రహించి అధికార పీఠాన్ని బీజేపీకే అప్పగించాలని నిర్ణయించారని చెప్పారు. 
 
జాతీయవాదంతో జాతి సమగ్రత, సమైక్యత  లక్ష్యంగా కొనసాగుతున్న బీజేపీ పాలనకు ఒక గొప్ప ఉదాహరణగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోవాలని,  అందుకే 37 సంవత్సరాల తర్వాత రెండోసారి వరుసగా యోగి సర్కారు అధికారాన్ని దక్కించుకుందని రాములమ్మ తెలిపారు.