శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (12:39 IST)

చక్రం తిప్పే ఏనుగు బొమ్మ పార్టీ(BSP), సైకిల్(SP) చక్రాల పరుగులకు బ్రేకులేసి కమల(BJP) వికాసం ఎలా జరిగింది?

ఉత్తర ప్రదేశ్. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే కేంద్రంలోనూ అదే పార్టీ చక్రం తిప్పుతుందని గతంలో ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు మరోసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురే లేదని తేలింది. వరుసగా రెండోసారి యోగీ ఆదిత్యనాథ్ తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. అటు ప్రధాని మోదీ- హోంమంత్రి అమిత్ షాల ఇమేజ్ యోగికి బాగా కలిసొచ్చే అంశమే. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపు నిజమయ్యాయి.

 
చక్రం తిప్పిన ఏనుగు గుర్తు పార్టీ చతికిల పడింది
ఇకపోతే... ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బహుజన సమాజ్ వాదిపార్టీ.. బీఎస్పీ. 37 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన బీఎస్పీ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగుసార్లు చక్రం తిప్పింది. ఆ పార్టీ అధ్యక్షురాలిగా వున్న మాయావతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు. మే 2007 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఎస్పీ మెజారిటీ స్థానాలను సాధించిన ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1991 తర్వాత ఆ పార్టీకి ఉత్తరప్రదేశ్ ప్రజలు కట్టబెట్టిన ఘన విజయం అదే.
మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 50 మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో లోని రాజ్‌భవన్‌లో 13 మే 2007న క్యాబినెట్ మంత్రులతో అట్టహాసంగా జరిగింది. మెజారిటీ అగ్రవర్ణాల ఓట్లను వారి సంప్రదాయ పార్టీ అయిన భాజపా నుండి ఆకర్షించడంలో మాయావతి సఫలీకృతమయ్యారు. అలా పూర్తి ఐదేళ్లకాలం ఆమె పదవిలో కొనసాగారు. ఈ కాలంలో రాష్ట్రంలో ఆమె ఏనుగు బొమ్మల శిల్పాల ఆవిష్కరణ ఇబ్బడిముబ్బడిగా చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీటితో పాటు అనేక సమస్యలతో సొంత పార్టీలోనే కుంపటి ప్రారంభమైంది.
 
 
ఫలితంగా 2007 అసెంబ్లీ ఎన్నికల్లో 206 సీట్లు సాధించిన బీఎస్పీ 2012లో ఎన్నికల్లో కేవలం 80 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో యోగీ ఆదిత్యనాథ్ దెబ్బకి బీఎస్పీ బలం మరింత కుంచించుకుపోయి 19కి పడిపోయింది.
 
తాజా 2022 ఎన్నికల్లో ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. సింగిల్ డిజిట్ స్థానాల కోసం పోటీ పడుతోంది. అలా ఒకప్పుడు ఎంతో ప్రాభవం... అంటే కనీసం 50 స్థానాలకు ఎక్కడా తగ్గని పార్టీ నేడు నాలుగైదు స్థానాల కోసం పాకులాడుతోంది.

తురుం ముక్క అఖిలేష్ యాదవ్ అన్నారు కానీ...
సమాజ్ వాది పార్టీ.... 29 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ఈ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది మాత్రం 2012 ఎన్నికల్లోనే. అంతకుముందు పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ 1993లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత 2003లో దాదాపు నాలుగేళ్లపాటు ఎస్పీ అధికారం చెలాయించింది. 2007 బీఎస్పీ దెబ్బకి చతికిలపడిన ఎస్పీ.. 2012 ఎన్నికల నాటికి పుంజుకుంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ రంగంలోకి దిగారు. యువకుడు కావడంతో ప్రజలు అతడి పాలన ఎలా వుంటుందో చూద్దాం అని భారీ మెజారిటీతో గెలిపించారు.

 
2012 ఎన్నికల్లో ఆ పార్టీకి 224 సీట్లు రావడంతో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఐతే ఆ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య, అత్యాచారాలు... ఇత్యాది సమస్యలు పెట్రేగిపోవడంతో ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఆ సమయంలోనే భాజపా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాషాయం ధరించిన యోగీ ఆదిత్యనాథ్ ను దించింది.

అటు ప్రధాని మోడీ చరిష్మా... ఇటు యోగీ పాలన
2018 ఎన్నికల్లో అఖిలేష్ ప్రభుత్వాన్ని మట్టికరిపించి ఎస్పీని కేవలం 47 సీట్లకే పరిమితం చేసారు. తాజా ఎన్నికల్లో బలం పుంజుకున్నప్పటికీ 125 సీట్ల ఆధిక్యంలో వున్నది. ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవడంలో సమాజ్ వాది పార్టీ విఫలమైందనే టాక్ వస్తోంది. ఏదేమైనప్పటికీ యోగీ ఆదిత్యనాథ్ పరిపాలనకు యూపీ ప్రజలు మరోసారి పట్టం కడుతున్నారు.