1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (09:29 IST)

పిల్లలు స్కూలుకు 7 గంటలకే వెళ్తుంటే... మనం 9 గంటలకు రాలేమా? సుప్రీం జడ్జి

supreme court
సుప్రీంకోర్టు న్యాయమూర్తి యుయు లలిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు పని గంటలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. పాఠశాలలకు వెళ్లే చిన్నారు ఉదయం 7 గంటలకే వెళ్తుంటే మనం 9 గంటలకు విధులకు హాజరుకాలేమా అని ప్రశ్నించారు. పైగా అన్ని కోర్టులను ఉదయం 9 గంటలకు ఎందుకు ప్రారంభించకూడదంటూ ఆయన ప్రశ్నించారు. 
 
సాధారణంగా కోర్టు పనిగంటలు 10.30కి ప్రారంభం అవుతాయి. అయితే శుక్రవారం జస్టిస్‌ లలిత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఓ కేసు విచారణను ఉదయం 9.30 గంటలకే ప్రారంభించింది. విచారణకు హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ దీనిపై సంతోషం వ్యక్తంచేశారు. 
 
దీనిపై జస్టిస్‌ లలిత్‌ స్పందిస్తూ.. 'చిన్నారులు ఉదయం ఏడు గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు.. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎందుకు ఉదయం తొమ్మిది గంటలకు తమ పని ప్రారంభించకూడదని నేను ఎప్పుడూ చెబుతుంటాను. కోర్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. తొమ్మిది గంటలకు పని ప్రారంభించి, పదకొండున్నర తర్వాత అరగంట విరామం తీసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పని ముగించుకోవచ్చు. దీనివల్ల సాయంత్రం కేసు ఫైళ్లు చదువుకోవడానికి మరింత సమయం దొరుకుతుంది' అని చెప్పారు.