1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (12:46 IST)

కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు 4 నెలల జైలు : సుప్రీంకోర్టు తీర్పు

Vijay mallya
కోర్టు ధిక్కరణ కేసులో కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాకు 2017 నాటి కోర్టు ధిక్కరణ కేసులో ఈ శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. అలాగే, రూ.2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
 
రుణాల ఎగవేతకు సంబంధించి విజయ్ మాల్యాపై ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు ఆయన ఆస్తులకు సంబంధించి పలు ఆదేశాలు జారీ చేసింది. 
 
అయితే, మాల్యా తన బ్రిటిష్‌ సంస్థ డియాగోను విక్రయించగా వచ్చిన 40 మిలియన్‌ డాలర్లను (భారత కరెన్సీలో దాదాపు రూ.317కోట్లు) తన పిల్లలకు బదిలీ చేశారని 2017లో బ్యాంకుల కన్సార్టియం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ సమాచారాన్ని న్యాయస్థానం వద్ద దాచారని, ఇది పూర్తిగా కోర్టు ఆదేశాల ఉల్లంఘనే అని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.
 
ఈ పిటిషన్‌పై అదే ఏడాది విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మాల్యా న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారని తేల్చింది. అతనిపై ధిక్కరణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ మాల్యా పిటిషన్‌ దాఖలు చేయగా.. 2020 ఆగస్టులో కోర్టు దాన్ని తిరస్కరించింది. 
 
ఆయన కోర్టు ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. అయితే, ఎన్ని సార్లు ఆదేశాలు జారీ చేసిన మాల్యా కోర్టుకు హాజరుకాకపోవడంతో మరోసారి విచారించిన న్యాయస్థానం.. ఈ ఏడాది మార్చి 10న తీర్పును రిజర్వ్‌లో పెట్టి నేడు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పులో పేర్కొంది. 
 
ఆయనకు రూ.2వేల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. మాల్యా తన పిల్లలకు బదిలీ చేసిన 40 మిలియన్‌ డాలర్ల నగదును నాలుగు వారాల్లోగా వడ్డీతో సహా కోర్టుకు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. లేదంటే ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
 
రూ.9వేల కోట్ల రుణ ఎగవేత ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిపోయిన మాల్యా.. 2016 నుంచి యూకేలో ఉంటున్నారు. ఆయనను భారత్‌కు అప్పగించే విషయమై అక్కడి న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారు.