'నూపుర్ శర్మ నోటి దురుసుతనం వల్ల దేశంలో మంట పెట్టారు.. దేశ భద్రతకే ముప్పు తెచ్చారు' - సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టులో నూపుర్ శర్మ కేసు విచారణ నేడు ప్రారంభమైంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ ఈ విచారణ జరిపింది. ఆమె నోటి దురుసుతనం వల్ల దేశం మొత్తం అట్టుడికిపోయిందని కోర్టు ఆమెను మందలించింది. ఉదయపూర్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనకు ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలే కారణమని నిందించింది.
న్యాయపరిశీలనలో ఉన్న అంశంపై టీవీ ఛానళ్లు ఎందుకు చర్చలు పెట్టాయని, అజెండాను ప్రచారం చేయడానికి తప్ప దీనివల్ల ప్రయోజనమేమిటని కోర్టు ప్రశ్నించింది. నూపుర్ శర్మ వ్యాఖ్యలు "కలత పెట్టే విధంగా ఉన్నాయని" చెబుతూ, అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కోర్టు నిలదీసింది. అయితే, నూపుర్ శర్మ తన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని ఆమె తరఫు సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ కోర్టుకు చెప్పారు. కోర్టు లాయర్ వాదన పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
"శర్మ టీవీ మీడియాకి వెళ్లి, దేశానికి క్షమాపణ చెప్పాల్సింది" అని వ్యాఖ్యానించింది. "ఆమె తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవడంలో జాప్యం చేశారని, అది కూడా 'మనోభావాలు గాయపడితే' అనే కండిషన్ పెట్టారని" కోర్టు వ్యాఖ్యానించింది. నూపుర్ శర్మ వ్యాఖ్యానించిన తీరును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. "మీరు ఒక పార్టీ ప్రతినిధి అయినంత మాత్రాన, ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి లైసెన్స్ రాదు" అంటూ చీవాట్లు పెట్టింది. మహమ్మద్ ప్రవక్త గురించి తన వివాదాస్పద వ్యాఖ్యలపై పలు రాష్ట్రాలలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ దర్యాప్తు నిమిత్తం దిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ సస్పెండ్ అయిన బీజేపీ నేత నూపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని శర్మ చెప్పారు.
"నేను ఏ విధమైన దర్యాప్తు నుంచి పారిపోదలుచుకోలేదు. నాపై నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకే చోట విచారణ జరపాలని కోర్టును కోరుతున్నాను" అని శర్మ పేర్కొన్నారు. అయితే, కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది.