శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 16 జూన్ 2022 (16:51 IST)

Live-in relationship: సహజీవనంలో ఉన్నవారికి జన్మించిన పిల్లలకూ పూర్వీకుల ఆస్తిపై హక్కు-సుప్రీం కోర్టు తీర్పుపై ఎవరేమన్నారు?

couple
పెళ్లి చేసుకోకుండా సహజీవనం ద్వారా సంతానం పొందిన హిందూ జంటల పిల్లలకు కుటుంబ ఆస్తిలో వాటా ఉంటుందంటూ సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. వివాహం చేసుకోకుండా సహజీవనం చేసే జంటల పిల్లలు కుటుంబ ఆస్తిలో వాటా పొందలేరన్న కేరళ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 'పెళ్లి చేసుకోకుండా చాలాకాలం కలిసి ఉన్న జంటలకు పుట్టిన పిల్లలకు కుటుంబ ఆస్తిలో వాటా లభిస్తుంది' అని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో పేర్కొంది.

 
పిటిషన్‌లో పేర్కొన్న పురుషుడు, మహిళ చాలా కాలంగా సహజీవనం చేసినట్లు ఆధారాలున్నాయని, వివాహితుల్లాగే వారి సంబంధాన్ని కొనసాగించారని పేర్కొంది. అందువల్ల వారి వారసులకు పూర్వీకుల ఆస్తిలో న్యాయమైన వాటా లభిస్తుందని ఈ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఈ వ్యవహారం కేరళలోని దిగువ కోర్టులో విచారణకు రాగా పెళ్లి లేకుండా కలిగిన సంతానానికి ఆస్తిపై హక్కు ఉంటుందని తీర్పునిచ్చింది. తర్వాత హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. చివరకు ఫిర్యాదుదారులు సుప్రీంకోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

 
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ప్రతివాదుల సాక్ష్యాలను అధ్యయనం చేశామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. దామోదరన్, చిరుతకుట్టి అనే ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నారని తాము నమ్ముతున్నట్లు వెల్లడించింది. వారిద్దరూ వివాహం చేసుకోలేదని నిరూపించడంలో ప్రతివాదులు విఫలమయ్యారని పేర్కొంది. పుట్టిన బిడ్డకు న్యాయమైన వాటాను ఇవ్వాలన్న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసులో ప్రతివాదులు దామోదరన్ సోదరుడైన అచ్యుతన్ కుమారుడు కరుణాకరన్ వారసులు. దామోదరన్, చిరుతకుట్టి చాలా కాలం పాటు భార్యాభర్తల్లా జీవించినట్లు పత్రాలు, సాక్ష్యాధారాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. దామోదరన్-చిరుత కుట్టిల కుమారుడు 1963లో సైన్యంలో చేరి 1979లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆస్తి పంపకం కోసం దావా వేశారు.

 
అసలు ఏమిటీ కేసు
ఈ కేసులో పిటిషనర్, కట్టుకండి ఇదాతి కృష్ణన్ తదితరులు వాదులు కాగా, కట్టుకండి ఇదాతి కరుణాకరన్ ప్రతివాదిగా ఉన్నారు. కేసు విచారణలో ఉండగానే కరుణాకరన్ చనిపోయారు. అందువల్ల ఆయన వారసులను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఆస్తి కట్టుకండి ఇడతిల్ కన్రన్ వైద్యర్‌కు చెందినది. ఆయనకు నలుగురు పిల్లలు. దామోదరన్, అచ్యుతన్, శేఖరన్, నారాయణన్. వీరిలో అచ్యుతన్‌కు కరుణాకరన్ అనే కొడుకు ఉన్నారు. శేఖరన్ పెళ్లి కాక ముందే మరణించగా, నారాయణన్‌కు ఒక కూతురు.


ఆమె కూడా సంతానం లేకుండానే మరణించారు. ఈ కేసులో మొదటివాది దామోదరన్-చిరుతకుట్టిల కుమారుడు. రెండోవాది దామోదరన్-చిరుతకుట్టిల మనవడు. ఇడతిల్ కన్రన్ వైద్యర్‌కు చెందిన ఆస్తితో సగం వాటా తమకు రావాలని వీరు కోర్టులో వాదించారు. అయితే, దామోదరన్, చిరుతకుట్టి ల వివాహం చెల్లుబాటు కానందున ఉమ్మడి భూమిలో వాటా లభించదని కేరళ హైకోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని పునఃపరిశీలించాలంటూ హైకోర్టు ట్రయల్ కోర్టుకు సూచించింది. అయితే ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు.

 
న్యాయవాదులు ఏం చెప్పారు?
సుప్రీంకోర్టు నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సఖా రామ్ సింగ్ వ్యాఖ్యానిస్తూ ఇది మంచి నిర్ణయమని పేర్కొన్నారు. "ఈ నిర్ణయం కచ్చితంగా పిల్లల హక్కులను గుర్తించింది" అని ఆయన బీబీసీతో అన్నారు. ఇంతకు ముందు కూడా అక్రమ సంతానం అనిపించుకున్న వారికి చట్టం ప్రకారం పూర్వీకుల ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని జస్టిస్ సింగ్ తెలిపారు. ఇది మంచి నిర్ణయమని అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ గోవింద్ మాథుర్ అన్నారు. ఇది కొత్త నిర్ణయం కానప్పటికీ, వివాహం లేకుండా చాలా కాలం పాటు కలిసి ఉన్నవారికి పుట్టిన బిడ్డకు జీవితంపై నమ్మకాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి ఇది మంచిదని ఆయన అన్నారు.

 
''అలాంటి పిల్లల వారసత్వ హక్కులు హిందూ మెరిట్ చట్టం 1955 ద్వారా సంక్రమిస్తాయి. అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తిలో వాటాదారులవుతారు'' అని పేర్కొన్నారు. అయితే, కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదని కూడా ఆయన అన్నారు. చిరుత‌కుట్టి తొలి పెళ్లి స‌రైందా కాదా అన్న విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అలాగే ఆమె రెండో పెళ్లిపై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.

 
నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుంది?
''హిందూ వారసత్వ చట్టంలో అక్రమ సంతానంగా పేర్కొన్న వారికి ఆస్తి హక్కులు కల్పించే నిబంధన ఉంది. ఇందులో వారి చట్టపరమైన హక్కులకు గుర్తింపు ఉంది'' అని పాట్నా హైకోర్టు రిటైర్డ్ జడ్జి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అంజనా ప్రకాశ్ బీబీసీతో అన్నారు. "హిందూ వారసత్వ చట్టం అటువంటి పిల్లలకు చట్టబద్ధంగా ఆస్తి, ఇతర హక్కులు కల్పించాలని చెబుతుంది. వివాహం నుండి పుట్టిన పిల్లలకు కూడా కుటుంబ ఆస్తిలో హక్కు లభిస్తుంది. ఇది ఈ దేశ చట్టం'' అని అంజనా ప్రకాశ్ వ్యాఖ్యానించారు.


పెళ్లి కాని జంటలకు పుట్టిన బిడ్డలు ఎందుకు బాధపడాలని న్యాయవాది కామినీ జైస్వాల్ అన్నారు. ''పెళ్లి చేసుకోకుండానే ఈ లోకంలోకి తీసుకురావాలని బిడ్డ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఇందులో పిల్లల తప్పు లేదు. దీనిపై సుప్రీంకోర్టు మంచి నిర్ణయమే ఇచ్చింది. ఈ నిర్ణయంతో అలాంటి పిల్లలకు హక్కులు లభిస్తాయి'' అని జైస్వాల్ బీబీసీతో అన్నారు.