శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified శనివారం, 11 జూన్ 2022 (16:52 IST)

కోవిడ్‌తో చనిపోయిన భర్త అస్థికలను ఆమె లాకెట్‌లో పెట్టుకుని బతుకుతున్నారు...

photo
ఒక ఏడాది క్రితం కోల్‌కతా‌కు చెందిన పాప్రీ చౌదరి, అరూప్ ప్రకాష్ చౌదరి కోవిడ్ చికిత్స కోసం ఒకే ఆసుపత్రిలో చేరారు. ఇంటెన్సివ్ కేర్లో ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న తన భర్తను ఒక సారి చూపించమని పాప్రీ చౌదరి నర్సులను అభ్యర్ధించారు. నర్సులు ఆమెకు పీపీఈ కిట్ వేసుకోమని చెప్పి, వీల్ చైర్లో ఐసీయూకి తీసుకుని వెళ్లారు. "నేనిక ఊపిరి తీసుకోలేను" అంటూ బ్రీతింగ్ మెషీన్ పైన ఉన్న ఆమె భర్త అరూప్ ప్రకాష్ చౌదరి నెమ్మదిగా అన్నారు.

 
ఆయన ఆయాసపడుతూ భార్య చేతిని పట్టుకున్నారు. పాప్రీ భర్తను నిర్లిప్తంగా చూశారు. "ఆయన పోరాడుతున్నారు. ఆయన బ్రతుకుతారు" అని ఒక నర్సు ఆమెతో చెప్పారు. కానీ, ఆయన బతకలేదు. అరూప్ నాలుగు రోజుల తర్వాత మరణించారు. ఆయన ప్రభుత్వ ఇంజనీరు. 23 ఏళ్ల అమ్మాయికి తండ్రి. గత ఏడాది భారత్‌ను అతలాకుతలం చేసిన రెండవ వేవ్ కోవిడ్‌లో మరణించిన వారి గణాంకాల్లో ఆయన మరణం కూడా చేరింది. చౌదరి తీవ్ర వేదనలో కూరుకుపోయినట్లు ఒక సంవత్సరం తర్వాత చెప్పారు.

 
దేవుడిని అసలు నమ్మని ఆమె పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోయారు. మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందని నమ్మడం మొదలుపెట్టారు. ఆమె జీవితంలో చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఆమె 20లలో ఉండగానే ఆమె తండ్రి మరణించారు. ఆ తర్వాత ఆమె తల్లి అల్జీమర్స్‌కు గురయ్యారు. "కానీ, అరూప్ నా రక్షణ కవచం. ఆయన నా వెలుగు. నా రక్షణ కవచం కూలిపోయింది. నా జీవితంలో వెలుగు మాయమయింది" అని ఆమె అన్నారు. 48 సంవత్సరాల చౌదరి ముస్తాబు అవ్వడం, ఇష్టమైన ఆహారం తినడం, కుటుంబ వేడుకలకు హాజరవ్వడం మానేశారు. ఆమె భర్త అస్థికలను తన లాకెట్లో పెట్టుకుని ధరిస్తున్నారు.

 
ఆమె స్నానం చేస్తూ ఏడుస్తారు. "నన్ను ఆఖరిసారి కౌగలించుకోమని అడుగుతాను. నామమాత్రంగా చెప్పే సంతాప సందేశాలు నాకు స్వాంతన ఇవ్వవు." "నా వేదనను నేనే మోస్తున్నాను. అందులోంచి బయటకు రాలేకపోతున్నాను. నా గుండెలో ఒక గాయం చేసుకుని అందులో నా భర్తను బంధించాను" అని చౌదరి చెప్పారు. కానీ, ఆమె జీవించడంపై ఆశను కోల్పోలేదు. ఆమె మానసిక శాస్త్రం చదవడానికి సాయంత్రం క్లాసుల్లో చేరారు. ఆమె థెరపిస్ట్ అవ్వాలని అనుకుంటున్నారు. ఆమె లాంటి వేదనను అనుభవిస్తున్న వారి నుంచి ఫోన్లు వచ్చినప్పుడు ఆమె వారికి కౌన్సెలింగ్ చేస్తూ ఉంటారు.

 
"మీరు ఇంట్లో చేసే పనితో పాటు బయట ఏదైనా పని చూసుకోండి. మీ జీవితంలో చేయాల్సిన పనులేమైనా ఉన్నాయేమోనని చూడండి" అని చెబుతూ మరొక భర్త కోల్పోయిన మహిళకు సందేశాన్ని పంపారు. ఆమె తన మూడు దశాబ్దాల వివాహ జీవితం, కోవిడ్ ఆమె జీవితాన్ని తలకిందులు చేసిన తీరు గురించి స్వీయ చరిత్ర రాస్తున్నారు. దీంతో పాటు, కోవిడ్ వల్ల మరణించిన వారి కోసం ఒక స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని రేకెత్తించేందుకు చూస్తున్నారు. "మహమ్మారి మిగిల్చిన భయాలను మర్చిపోవడానికి చూస్తున్నట్లుగా ఉన్నారు. జరిగిందంతా విధి అని అనుకుంటున్నారు. కోవిడ్ బాధితుల కోసం ఒక స్మారకం చాలా ముఖ్యం" అని చౌదరి అన్నారు.

 
ఫిబ్రవరిలో ఒక వర్చువల్ స్మారకం కోసం ఆమె భర్త జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. దీనిని కొంత మంది డాక్టర్లు, సాంఘిక సేవకులు కలిసి మొదలుపెట్టారు. భారత్‌లో ఇలాంటి స్మారకం ఇదొక్కటే. "నా గొంతులో ఎవరో కత్తిని దించినట్లుగా ఉంటుంది. దాంతో, కలిసి ఉండలేను, అలా అని చావలేను" అని ఆమె రాశారు. ఈ స్మారకం మొదలుపెట్టిన ఒక ఏడాదికి ఇందులో సుమారు 300 మంది తమ వివరాలను పొందుపరిచారు. ఫిబ్రవరిలో ఈ స్మారక నిర్వాహకులు, భారతదేశంలో కోవిడ్ పరిహారం కోసం నమోదు చేసిన వారి వివరాలను ఇమ్మని దేశంలోని 29 రాష్ట్రాలకు ఆర్ టి ఐ అభ్యర్థనలను చేశారు. అయితే, ఈ అభ్యర్ధనలు 11 రాష్ట్రాలు మాత్రమే స్పందించి 182 పేర్లను మాత్రమే ఇచ్చాయి.

 
"మరణించిన వారి పేర్లను సేకరించడం కూడా చాలా పెద్ద పని. మనం చాలా తొందరగా మర్చిపోవాలని అనుకుంటున్నాం. అలసిపోయి ఉండవచ్చు, లేదా, జరిగిందేదో జరిగిపోయింది అనే తత్త్వం కావచ్చు" అని ఈ స్మారక రూపకర్త డాక్టర్ అభిజీత్ చౌదరి అన్నారు. "మన జ్ఞాపకాలు చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటాయా? లేదా మనం వాటిని తిరస్కరిస్తూ బ్రతికేస్తామా?" దీనికి సమాధానం చెప్పడం కష్టం. కొన్ని లక్షలాది మంది భారతీయులు తమ ఆప్తుల మరణానికి బాధపడుతున్నారు. అందులో చాలా మరణాలు అకస్మాత్తుగా జరిగినవే.

 
వైద్య వ్యవస్థ వైఫల్యం, ఆసుపత్రి బెడ్‌లు, ఔషధాలు, ఆక్సిజన్ కొరత లేకపోయి ఉండి ఉంటే చాలా ప్రాణాలు కాపాడగల్గి ఉండేవారు. కొంతమంది పక్కన ఎవరూ లేకుండా మరణించారు. లాక్‌డౌన్ వల్ల మరణించిన వారి అంత్యక్రియలకు కూడా కుటుంబ సభ్యులు హాజరు కాలేకపోయారు. మరణించిన వారి సంఖ్యను సరైన రీతిలో లెక్కించలేదనే వాదనను కొట్టిపడేస్తూ ఈ విపత్తును దాటి ముందుకు కదిలేందుకు భారత్ తొందరపడుతున్నట్లుగా ఉందని చాలా మంది బాధితులు భావిస్తున్నారు. తిరస్కరించడం వల్ల మర్చిపోవడం సులభం అవుతుంది" అని డాక్టర్ అభిజీత్ చౌదరి అన్నారు.

 
డాక్టర్ రజని జగ్‌తప్ 2020లో తన భర్త మరణం తర్వాత తన లాంటి బాధితుల కోసం ఒక సపోర్ట్ గ్రూపును మొదలుపెట్టారు. ఆధునిక కాలంలో మృత్యువుకు స్పందించే తీరులో మార్పులు వస్తున్నాయి. చాలా కుటుంబాలు నగరాలకు వలస వెళ్లారు. కుటుంబాలు న్యూక్లియర్‌గా మారాయి. వేదన కూడా వ్యక్తిగతంగా, కుటుంబానికే పరిమితంగా మారిపోయింది. ఆప్తులను కోల్పోయిన తర్వాత ఒంటరితనంతో, కోపంతో కొట్టుమిట్టాడుతున్న చాలా కుటుంబాలు వేదన, ఆందోళన నుంచి బయటపడేందుకు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. కొంత మంది సపోర్ట్ గ్రూపులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 
రజని జగ్‌తప్ భర్త శ్రీధర్ పుణెలో కోవిడ్ 19 బారిన పడి మరణించారు. వారిద్దరూ డాక్టర్లు. ఆమె కోవిడ్‌లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు 'స్టేయింగ్ అలైవ్' అనే ఆన్ లైన్ సపోర్ట్ గ్రూపును ప్రారంభించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం 60 మంది సభ్యులున్నారు. అందులో ఒక థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఒక న్యాయవాది ఒక యోగ గురువు కూడా ఉన్నారు. ఇందులో చాలామంది మహిళలు. ఒకామె తన బిడ్డను కోల్పోయిన కొన్నేళ్ళకు భర్తను కూడా వైరస్‌కు కోల్పోయారు. మరొక మహిళ భర్తను, తోడికోడలిని కూడా ఒకే ఆసుపత్రిలో కోల్పోయారు. డాక్టర్ జగ్‌తప్ మాదిరిగానే చాలామంది తమ కుటుంబ సభ్యుల సంవత్సరీకం తర్వాత ఈ వేదన నుంచి బయటకు వచ్చేందుకు ఏదో ఒక మార్గాన్ని వెతుక్కుంటున్నారు.

 
"మా అందరి అనుభవాలు ఒక లాంటివే" అని డాక్టర్ జగ్‌తప్ చెప్పారు. "వైద్య వ్యవస్థ పట్ల కొన్ని భ్రమలు ఉన్నాయి. కొంతమంది డాక్టర్లను నిందిస్తారు. కొంత మంది మహిళలు అత్తింటి వారితో సమస్యలను ఎదుర్కొని ఒంటరిగా, వెలి వేసినట్లుగా అయిపోయారు. అందరిలోనూ "నాకే ఎందుకిలా జరిగింది" అని ఒకే లాంటి వేదన, ఆగ్రహం ఉన్నాయి. "కానీ, మేమెప్పటికీ ఈ విషయాన్ని మర్చిపోతామని అనుకోవడం లేదు. కుటుంబాలు చాలా రక్షణను ఇస్తాయి. స్మారకం నిర్మాణం చాలా మంచి ఆలోచన" అని అన్నారు. వేదనను అనుభవించడానికి కూడా సమయం లేకుండా పోయింది.

 
"చాలా మంది భారతీయులకు వేదన కోసం కూడా సమయం లేదు. ధనవంతులు, ఉన్నత వర్గాల వారు, నగరాల్లో ఉన్నవారికి వేదన కోసం సమయం ఉంది. కానీ, ఇతరులకు మాత్రం వేదన అనేది కొన్ని సంప్రదాయాలను వేగంగా పూర్తి చేసి ముందుకు కదిలిపోవడమే. కొంతమందికి జీవితం చాలా కఠినంగా ఉంటుంది" అని సౌమిత్ర పథారే అనే మానసిక నిపుణులు చెప్పారు. "దీనర్ధం వారికి విచారం లేదని కాదు. విచారించేందుకు సమయం లేదు". గుండెను మెలి పెట్టే బాధ మాత్రం పూర్తిగా వ్యక్తిగతం.

 
"గత ఏడాది వేసవిలో ఆసుపత్రి నుంచి తన భర్త మరణ వార్త చెప్పేందుకు వచ్చిన ఫోన్‌ను ఆమె కూతురు తన్వీషాను తీసుకోమని చెప్పారు. ఆమె ఆ ఫోన్ పట్టుకుని గదిలోంచి బయటకు వెళ్లారు. నాన్న ఇక లేరు" అని చెప్పారు. కూతురి జుట్టు నిమురుతూ ఆమె మౌనంగా ఉండిపోయారు. "అమ్మా, నువ్వు కూడా ఇప్పుడు అమ్మమ్మలా అయిపోతావా"? అని ఆమె కూతురు తన్వీషా అడిగింది. వేదన తనతో పాటు కొత్త భయాలను కూడా తీసుకొస్తుంది.