మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (07:38 IST)

భారత సైక్లింగ్ కోచ్‌పై మహిళా సైక్లిస్టుల లైంగిక వేధింపులు ఆరోపణలు

cycling
జాతీయ సైక్లింగ్ కోచ్‌గా ఉన్న ఆర్.కె. శర్మపై భారత అగ్రశ్రేణి మహిళా సైక్లిస్ట్ ఒకరు లైంగిక వేధింపుల  ఆరోపణలు చేశారు. తనపై ఆయన అసభ్యంగా ప్రవర్తించారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆమె ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 18 నుంచి 22 వరకు న్యూ ఢిల్లీలో ఆసియన్‌ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. దీనికి సన్నాహకంగా స్లొవేనియాలో ప్రిపరేషన్ క్యాంపు నిర్వహించారు. అక్కడ కోచ్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు మహిళా సైక్లిస్టు ఫిర్యాదులో పేర్కొంది.
 
స్లోవేనియా పర్యటన సందర్భంగా ఆర్‌కే శర్మ తన గదిలోకి అనుమతి లేకుండా వచ్చి లైంగిక వేధింపులకు గురిచేశాడని, అతడిని పెళ్లి చేసుకోవాలని కూడా అడిగాడని ఆమె ఆరోపించింది. 
 
దీంతో సాయ్‌ సూచనల మేరకు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఐ) బుధవారం భారత బృందాన్ని స్లోవేనియా నుంచి వెనక్కి రప్పించింది. కోచ్‌పై ఆరోపణలు చేసిన మహిళా సైక్లిస్ట్ జూన్‌ 3న భారత్‌కు చేరుకుంది. ఈ అంశంపై విచారణ జరిపేందుకు సాయ్‌, సైక్లిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) రెండూ వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశాయి.