బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (21:29 IST)

జయలలిత పరామర్శకు నరేంద్ర మోడీ? తమిళనాడు ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిపై చర్చలు!

తమిళనాడు ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిని నియమించే అంశంపై రసవత్తర చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై రాష్ట్ర ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుతో ఆ రాష్ట్ర మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామి, ప్రభుత్వ ప్రధా

తమిళనాడు ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిని నియమించే అంశంపై రసవత్తర చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై రాష్ట్ర ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుతో ఆ రాష్ట్ర మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావులు శుక్రవారం సమావేశమయ్యారు. ఆ తర్వాత కావేరీ జలవివాదం, కావేరి బోర్డు ఏర్పాటుపై అంశంపై చర్చిస్తున్నట్టుగా ఒక పత్రికా ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 
 
మరోవైపు... తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్‌సెల్వం లేదా సీనియర్ మంత్రి ఆర్ పళనిస్వామిల్లో ఒకరిని నియమించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై చర్చించేందుకే మంత్రులిద్దరూ గవర్నర్‌తో సమావేశమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ముఖ్యమంత్రి ఆస్పత్రిలో ఉండటం వల్ల రాష్ట్రంలో పాలన స్థంభించిందనీ, ఐఎస్ స్లీపర్ సెల్స్ వెలుగు చూశాయనీ, అందువల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ అంశంపైనే మంత్రులిద్దరూ గవర్నర్‌తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఇంకోవైపు.. గత నెల 22వ తేదీన నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం చెన్నైకు వస్తున్నట్టు ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నైకు వచ్చి జయలలితను పరామర్శించి వెళ్లారు. అయితే, ఈయనను కూడా జయలలితను చూసేందుకు అనుమతించలేదన్న వార్తలు వస్తున్నాయి.