మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ముంబై ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై దాడి...

కోల్‍‌కతా ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో జూనియర్ మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. ఈ వేడి సద్దుమణకముందే... ముంబై ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై దాడి జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగితో పాటు మరో ఐదారుగురు వ్యక్తులు దాడి చేసి డాక్టర్‌ను గాయపరిచారు. ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పేషెంట్‌తో సహా అందరూ మద్యం మత్తులో ఉన్నారని, డాక్టర్‌ను పరుష పదజాలంతో దూషిస్తూ ఆస్పత్రిలో గొడవకు దిగారని తెలిపారు. 
 
దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని సియోన్ ఆసుపత్రికి ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి ముఖంపై గాయాలతో రక్తమోడుతూ వచ్చాడు. ఆయనతో ఐదారుగురు వ్యక్తులు తోడుగా వచ్చారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారు. వార్డులో విధులు నిర్వర్తిస్తున్న రెసిడెంట్ డాక్టర్ ఈ పేషెంట్‌ను అటెండ్ అయ్యారు. గాయాలకు చికిత్స చేస్తుండగా పేషెంట్ తిట్లదండకం మొదలు పెట్టాడు. 
 
ఆపై మహిళా వైద్యురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యురాలికి గాయాలయ్యాయి. వైద్యురాలి కేకలతో సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకునేలోగా నిందితులు అందరూ పారిపోయారు. ఈ ఘటనపై బాధిత డాక్టర్ సియోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.