మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (14:53 IST)

అలాంటివారు దేశ ద్రోహులే : యోగి ఆదిత్యనాథ్

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్‌లో ఇండియాపై పాకిస్థాన్ గెలిచిన తర్వాత కొందరు కాశ్మీర్ యువత సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది.
 
దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. గత ఆదివారం భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌‌లో భారత్ తన ప్రత్యర్థి పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే, పాక్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ఆగ్రాలోని రాజా బ‌ల్వంత్ సింగ్ కాలేజీలో కాశ్మీరీ విద్యార్థులు సంబురాలు జ‌రుపుకున్నారు. 
 
విద్యార్థుల సంబురాల‌ను నిర‌సిస్తూ కొంద‌రు ఆగ్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు విద్యార్థుల‌ను అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆగ్రా ఎస్పీ మాట్లాడుతూ, ఇండోపాక్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దేశ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ఉపేక్షించ‌బోమ‌ని హెచ్చరించారు. 
 
ఈ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అనంత‌రం ముగ్గురు కాశ్మీరీ విద్యార్థుల‌ను అరెస్టు చేశామ‌న్నారు. పాకిస్తాన్ విజ‌యం అనంత‌రం ఆ దేశానికి మ‌ద్ద‌తు తెలుపుతూ సంబురాలు నిర్వ‌హించుకున్న వారిపై దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేస్తామ‌ని యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్ప‌ష్టం చేశారు.
 
జ‌మ్మూకాశ్మీర్‌లోని నాన్ లోకల్స్‌కు యునైటెడ్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ ఉగ్ర‌వాద సంస్థ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో భాగంగా ఇండియాపై పాకిస్తాన్ విజ‌యం సాధించడంతో.. శ్రీన‌గ‌ర్‌లో మెడిక‌ల్ స్టూడెంట్స్ సంబురాలు చేసుకున్నారు. మెడిక‌ల్ స్టూడెంట్స్ సంబురాల‌ను నిర‌సిస్తూ.. కొంత‌మంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో యూఎల్ఎఫ్ ఉగ్ర‌వాద సంస్థ స్పందించింది. 
 
మెడిక‌ల్ స్టూడెంట్స్‌పై ఎవ‌రు ఫిర్యాదు చేశారో త‌మ‌కు తెలుసని నాన్ లోక‌ల్స్‌ను ఉద్దేశించి యూఎల్ఎఫ్ వ్యాఖ్యానించింది. 48 గంట‌ల్లో క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. నాన్ లోక‌ల్ ఉద్యోగులు, విద్యార్థులు ఈ ఫిర్యాదుల వెనుక ఉన్న‌ట్లు తెలిసింద‌ని యూఎల్ఎఫ్ పేర్కొన్న‌ది.