ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు
ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ, కొన్ని పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న కథనాలను మంత్రి ఆదిమూలపు సురేష్ తప్పుపట్టారు. ప్రైవేట్ యాజమాన్యం కింద నడిచే విద్యాసంస్థల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక కమిటీ వేశారని, ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో వెలుగు చూసిన పలు అంశాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. ఎక్కడైతే దీర్ఘకాలికంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఎయిడెడ్ స్కూళ్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని చెప్పారు.
ఒకవేళ ప్రయివేట్ యాజమాన్యాలు స్కూళ్లను ప్రభుత్వానికి అప్పగిస్తే, మెరుగ్గా నడిపించుకోవాడానికి, స్కూళ్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ, ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ ఉపాధ్యాయులను నియమిస్తూ అభివృద్ధి చేసుకోవచ్చంటూ కమిటీ నివేదికలో పేర్కొందన్నారు. అందులో భాగంగానే ఎయిడెడ్ విద్యా సంస్థల నిర్వహణపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు.
ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకుని ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం విలీనం చేసుకుంటే స్కూళ్లు మూతపడిపోతాయని అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఏ ఒక్క ప్రైవేట్ యాజమాన్యాన్ని బలవంతం పెట్టడం లేదని, . యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించకుండా కచ్చితంగా తమ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్‌లను కూడా మంత్రి సురేష్ మీడియా ముందు ఉంచారు.
రాష్ట్రంలో ఉన్న సుమారు 137 పైచిలుకు డిగ్రీ కాలేజీలు, వాటిలో ఏడు డిగ్రీ కాలేజీలు మేనేజ్‌మెంట్, స్టాఫ్‌తో పాటు, వాటికి సంబంధించిన ఆస్తులు ఇస్తున్నామంటూ చాలా స్పష్టంగా, రాతపూర్వకంగా ఇచ్చాయి. 124 డిగ్రీ కాలేజీలు కేవలం స్టాఫ్ ను మాత్రమే సరెండర్ చేస్తామని, ఆస్తులను తామే ఉంచుకుని, ప్రైవేట్ కళాశాలలుగా నడుపుకుంటామని తెలిపాయి. 93శాతం డిగ్రీ కాలేజీలు విల్లింగ్‌నెస్‌ను ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం బలవంతంగా తమ విద్యాసంస్థలను తీసుకున్నాయని, తామే నడుపుకుంటామని చెబితే అందుకు మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు.
ఇక స్కూళ్ల విషయానికి వస్తే... దాదాపు 1,988 స్కూళ్లు ఉంటే 1,200 స్కూళ్ల యాజమాన్యాలు స్టాఫ్‌తో పాటు ప్రభుత్వానికి అప్పగిస్తున్నామని రాతపూర్వకంగా ఇచ్చాయి. అలాగే 88 స్కూళ్లు ఆస్తులతో పాటు స్టాఫ్‌ను ఇస్తున్నట్లు ఒప్పుకున్నాయి. మొత్తంగా 1302 స్కూళ్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. విశాఖలో సెంట్ పీటర్స్, కాకినాడలో సెంట్ యాన్స్ స్కూళ్ల యాజమాన్యాలు "తాము స్కూళ్లు మూసివేస్తున్నామని, ప్రభుత్వం బలవంతంగా ఎయిడెడ్ స్కూళ్లను లాక్కున్నది కాబట్టి మీ పిల్లల్ని వేరే స్కూళ్లలో చేర్చుకోండని" ఏదైతే చెప్పడం జరిగిందో దానివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆ స్కూళ్ల యాజమాన్యాలు తామే నడుపుకుంటామని చెబితే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.