అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వైస్‌కన్వీనర్‌ నాగేందర్‌తో ముఖాముఖి

ప్రథమ తెలంగాణ ప్రపంచ మహాసభలు జూలై 8 నుండి 10 వరకు జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజుల కార్యక్రమ వివరాలను వైస్ కన్వీనర్ నాగేందర్ ఐత గారు మరియు వివిధ కమిటీల ప్రతినిధులు మీడియా ప్రతినిధి కృష్ణ చైతన్య

Nagender
ivr| Last Updated: బుధవారం, 6 జులై 2016 (21:42 IST)
ప్రథమ తెలంగాణ ప్రపంచ మహాసభలు జూలై 8 నుండి 10 వరకు జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజుల కార్యక్రమ వివరాలను వైస్ కన్వీనర్ నాగేందర్ ఐత గారు మరియు వివిధ కమిటీల ప్రతినిధులు మీడియా ప్రతినిధి కృష్ణ చైతన్య అల్లంతో
మాట్లాడుతూ, 8 నాడు బాంక్వెట్‌తో పాటుగా అనేక కార్యక్రమాలు రూపొందించామని తెలియచేసారు.

చైతన్య: మూడు రోజుల తెలంగాణ సమావేశాల్లో మన రెండో తరం ఏ రకంగా పాలు పంచుకుంటుంది?
నాగేందర్: మన వారసత్వానికి మన ఆనవాళ్ళని పరిచయం చేయాల్సిన అవసరం దృష్ట్యా వాళ్ళని కూడా కార్యక్రమంలో ప్రధాన భాగస్వాములని చేసి, తెలంగాణ వారధులతో పరిచయ కార్యక్రమాలు, వివిధ తెలంగాణ సంబంధిత కార్యక్రమాల్లో వాలంటరీ వర్క్ ఏర్పాటు చేశాం. వంటలు, విందు, హాళ్ళ పేర్లు, ఎగ్జిబిట్లలో తెలంగాణతనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశాం. ఉదాహరణకు రాజకీయ చర్చలు జరిగే చోటుకి “ప్రాణహిత” అనే పేరు పెట్టాం. ఒక అబ్బాయి అడిగాడు “వాట్ ఇస్ ప్రాణహిత అంకుల్” అని. ప్రాణహిత గురించి వివరంగా చెప్పాను. సహజసిద్ధమైన కుతూహలం పిల్లల్లో కలిగేవిధంగా, అంటే మనలో అంతర్భాగమైన జీవనవిధానం, పోరాటపటిమ, మన మహనీయులు, మన జాగ్రఫీ, మన చరిత్రల పరిచయం మన పిల్లలకు అందచేయకుంటే ఎట్ల?

చైతన్య: చాలా మంచి ఆలోచన. సాంస్కృతిక కార్యక్రమాల గురించి తెలియ చేస్తారా?
నాగేందర్: మనకు అనాదిగా మనదై నిలిచిన మన పాటని ఎత్తుకుని రసమయి వస్తున్నడు. మనం అక్కడికి పోలేక పోయినా మన దగ్గరికి మన పాట వస్తున్నదంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ పలు కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ పాటని హత్తుకున్నం. సినిమాల్లో మన పాటకు వెన్నుదన్నై నిలిచిన సుద్దాల గారి లాంటి గొప్ప రచయితలు అడగంగానే మా పల్లె పాట, తెలంగాణ సినిమా పాట పోటీలకు రావడం, మా పోటీల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అనుప్ రూబెన్ స్పెషల్ మ్యూసికల్ నైట్, వివిధ కళా రూపాల జాతర, ఇండియా కెనడాల నుండి వస్తున్న వివిధ నృత్య బృందాలు, అనేక పాటల కార్యక్రమాలు ఉండబోతున్నై.

చైతన్య: తెలంగాణతనం కనిపించబోతుందా?
నాగేందర్: అణువణువునా కనిపించబోతుంది. ప్రత్యేక బతుకమ్మ, బోనాల పండుగలు చేసుకుంటున్నాం. ఎన్ ఆర్ ఐ సమస్యల సమావేశాలు, పొలిటికల్ సమావేశాలు, బంగారు తెలంగాణ మీద సమావేశాలు, జిల్లాల వారీ చర్చలు, బిజినెస్ సమావేశాలు, మిషన్ తెలంగాణ సమావేశాలు, వివాహ వేదిక, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం అదే ఆలయ పూజారుల సమక్షంలో జరగడం, ఎన్నెన్నో పల్లె పాటల వెన్నెల కొనలలో మన ఈ మూడు రోజులు ఎక్కడ చూసినా తెలంగాణమయమైన అమెరికా నగరం కనిపించే విధంగా ఉండబోతుంది.

చైతన్య: ఈవెంట్ లైవ్ సమాచారం గురించి మేము ఎక్కడ తెలుసుకోవచ్చు?
నాగేందర్: రెండు కళ్ళు చాలవు అంటారు చాలామంది ఏదయినా ఈవెంట్ గురించి చెప్పాలంటే. నిజానికి ఇక్కడ అదే పరిస్థితి. ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. కొన్ని ఒకే సమయంలో వేరువేరు చోట్ల జరుగుతాయి. టీ న్యూస్, టీవీ 5, ఎన్ టీవీ, మన టీవీ, సాక్షి తదితర చానళ్లల్లో అప్డేట్స్ చూస్తూ ఉండొచ్చు. కార్యక్రమానికి రాలేకపోయిన వారందరూ ప్రత్యక్ష ప్రసారం చూడడానికి ఫేస్ బుక్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.

చైతన్య: అడగ్గానే మీ విలువైన సమయాన్ని కేటాయించి వివరాలు తెలియచేసారు. థాంక్స్ ఎ లాట్, నాగేందర్ గారు.
నాగేందర్: తప్పకుండా. తెలంగాణ సాంస్కృతిక వైభవం దేశదేశాల్లో కొనియాడబడి, కొనసాగాలనేదే మా ఆశ అని చెప్పారు.దీనిపై మరింత చదవండి :