Saumya pradosh: బుధవారం ప్రదోషం.. శివాలయాల్లో సాయంత్రం పూట ఇలా చేస్తే?
శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు ప్రదోషం వస్తుంది. ఈ రోజు అంటే బుధవారం ఆగస్టు 20, 2025 ప్రదోషం వచ్చింది. ప్రదోషం వచ్చే వారాన్ని బట్టి ప్రదోషం పేరు మారుతుంది. ఈసారి బుధవారం ప్రదోషం రావడం వలన దీనిని బుధ ప్రదోషం అంటారు.
ఈ రోజున శివపార్వతులను పూజించడం ద్వారా మనోభీష్టాలు చేకూరుతాయని విశ్వాసం. బుధ ప్రదోషం రోజున చేసే శివపూజలకు కోటి రెట్ల ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యా దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. శివాష్టకం పఠించాలి.
అనంతరం శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకాలు, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి దేవుడికి సమర్పించాలి. పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
ఇంటికి తిరిగి వచ్చాక ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇలా బుధవారం పూట వచ్చే ప్రదోష వేళ మహాదేవుడిని పూజించడం ద్వారా నవగ్రహ దోషాలతో పాటు సమస్త ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. బుధ ప్రదోషం రోజు బ్రాహ్మణులకు, అన్నార్తులకు అన్నదానం చేయడం శ్రేష్టం. శక్తి ఉన్నవారు ఇతర దానాలు కూడా చేయవచ్చు.