శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (15:51 IST)

శ్రీవారి అర్జిత సేవ వెనుక ముస్లిం భక్తుని హార్ట్‌ టచింగ్ స్టోరీ...

పీవీఆర్‌కే ప్రసాద్.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా పనిచేసే సమయం. సరిగ్గా అవే రోజుల్లో దేవస్థానం వారు కూడా తమ స్వర్ణోత్సపు సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచి పోయేటట్లుగా

పీవీఆర్‌కే ప్రసాద్.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా పనిచేసే సమయం. సరిగ్గా అవే రోజుల్లో దేవస్థానం వారు కూడా తమ స్వర్ణోత్సపు సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచి పోయేటట్లుగా ఏదన్నా కొత్త పని మొదలుపెడితే బావుంటుందన్న ఆలోచనలో ఉన్నారు.
 
వారంతా ఆలోచనైతే చేశారు కానీ ఎన్ని దఫాలుగా, ఎన్ని మీటింగ్‌లు పెట్ట ఎంత చర్చించినా ఆ ఆలోచన ఆచరణలో పెట్టడంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయారు. సమయం దగ్గరపడుతోంది. ఏం చేయాలో దిక్కుతోచనిస్థితి. వెంటనే ఏదో ఒకటి ప్లాన్ చెయ్యకపోతే అభాసుపాలు అవుతామేమోనన్న భయం అందరిలోనూ ఏ మూలో ఉంది.
 
అక్కడున్న వారిలో తితిదే బోర్డు మెంబర్లుగా ఉన్న కొద్ది మంది పేరొందిన ప్రముఖులతో పాటు మరికొంతమంది ముఖ్యమైన ఆలయ అధికారులు కూడా ఉన్నారు. అప్పుడక్కడ వేడిగా వాడిగా చర్చ జరుగుతోంది. కానీ తమ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా స్వామివారికి కొత్తగా ఏం చేస్తే బావుంటుంది అన్న విషయంలో మాత్రం అక్కడున్న పెద్దలు ఒక ఫర్‌ఫెక్ట్ అవగాహనకు రాలేక పోతున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఈఓ పీవిఆర్కే ప్రసాద్ అసహనం. 
 
సరిగ్గా అదేసమయంలో తలుపు తోసుకొని ఆఫీస్ అటెండర్ మెల్లగా ప్రసాద్ దగ్గరికి వచ్చాడు. అసలే చిరాకుగా ఉన్న ప్రసాద్ టైం గానీ టైంలో వచ్చిన ఆ అటెండర్ని చూస్తూ ఏంటయ్యా అని మరింత చిరాకు పడుతూ అడిగారు. కంగారు పడిన ఆ అటెండర్ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ ఆయన ముందుకొంగి సార్ మిమ్మల్ని కలవడం కోసం గుంటూరు నుంచి ఎవరో భక్తుడు వచ్చాడు అని మెల్లగా చెప్పారు. చిర్రెత్తుకొచ్చింది ఈఓకి. ఎవరయ్యా అతను. ఇప్పుడింత అర్జెంటుగా మీటింగ్‌లో ఉంటే నన్ను ఇబ్బంది పెట్టిమరీ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది. కాసేపు ఉండమను. మరి కాస్త చిరాకు పడిపోతూ అన్నారు ఈఓ. చెప్పాను సార్. కానీ ఏదో అర్జెంటుగా మీతో మాట్లాడాలట. అతని పేరు షేక్ మస్తాన్ అని కొద్దిగా భయపడుతూ చెప్పాడు అటెండర్.
 
షేక్ మస్తానా.. అని ముందు కాస్త ఆశ్చర్యపోయినా ఎవరో ముస్లిం భక్తుడు ఏదో సిఫారసు లేఖతో వచ్చి ఉంటాడు. మా వాళ్ళు నా దగ్గరికి పంపించుంటారు. మళ్ళీ బయటకు పోవడం ఎందుకు ఏదో రెండు నిమిషాలిక్కడే మాట్లాడి పంపించేస్తే సరిపోతుంది కదా అని మనసులో అనుకుంటూ సరేనయ్యా ఇక్కడికే రమ్మను అని అటెండర్‌తో చెప్పి పంపించేశారు ప్రసాద్. అప్పుడు దురదృష్టవశాత్తు ప్రసాద్‌కి గానీ అదే రూంలో ఉన్న ఏ ఇతర బోర్డు మెంబర్లకి గానీ తెలియని విషయం ఏమిటంటే కాసేపట్లో తమ ముందుకు రాబోతున్న ఆ ముస్లిం భక్తుడు కేవలం ఒక భక్తుడు మాత్రమే కాదనీ స్వయంగా తమ స్వామివారు పంపిస్తే తమ దగ్గరికి వస్తున్నాడని అంతేకాకుండా అతని ద్వారానే తాము ఇన్నాళ్ళుగా స్వర్ణోత్సవ సంవత్సర సమస్యకు కూడా గొప్ప పరిష్కారం దొరకబోతోందని గ్రహించేవారు. 
 
ఇవేమీ తెలియని ఆ పెద్దలంతా ఆ రూంలో వెయిట్ చేస్తుంటే ఆ ముస్లిం భక్తుడొక్కరు బయట వెయింటిగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అటెండర్ బయట కొచ్చి ఆ ముస్లిం భక్తుడి దగ్గర కెళ్ళి చెప్పాడు. సార్ మా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పారు. అప్పటిదాకా తన కూర్చున్న చెక్క కుర్చీ లోంచి లేచి ఆ అటెండర్‌కి థ్యాంక్స్ చెబుతూ ఆ ముస్లిం భక్తుడు ఒక్కో అడుగుటూ వేసుకుంటూ బోర్డు రూం లోపలికి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు. వెళుతూనే రెండు చేతులు జోడించి అక్కడున్న వారందరికీ ఎంతో వినమ్రంగా నమస్కారం చేసి ఆ తర్వాత మెల్లగా ప్రసాద్ వైపు తిరిగి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.
 
అయ్యా నా పేరు షేక్ మస్తాన్ మాది గుంటూరు జిల్లా. మాది చాలా పెద్ద కుటుంబం. అన్నదమ్ములిద్దరం కలిసి ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉంటాం. మా కుటుంబానికిక్కడ ఓ చిన్నపాటి వ్యాపారముంది. ఎన్నో తరాలుగా మేమంతా స్వామి వారి భక్తులం. మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా కుటుంబ సభ్యులమంతా చిన్నపిల్లలతో సహా ఒక పద్ధతి ప్రకారం పొద్దున్నే లేచి స్వామి వారి ముందు నిలబడి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తాం. అలాగే ఏ మాత్రం తప్పులు పోకుండా శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రపత్తి, మంగళశాసనం కూడా పఠిస్తాం. నామటుకు నేను శ్రీనివాస గద్యం మొత్తం పొల్లుపోకుండా అప్పజెప్పగలను. 
 
తరతరాలుగా మా ఇంట్లో మరో ఆచారం కూడా ఉంది. అదేమిటంటే మేమంతా కలిసి ప్రతి మంగళవారం పొద్దున్నే లేచి మా పెరట్లో పూచే రకరకాల పూలతో స్వామివారి 108 నామాలూ ఒక్కొక్కటిగా పటిస్తూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వు చొప్పున సమర్పిస్తూ శ్రీ స్వామివారి అష్టోత్తర శతనామపూజ చేస్తాం. అయ్యా ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే మా తాతగారు అంటే మా తండ్రి గారి తండ్రి తన చివరి రోజుల్లో స్వామివారికి తన స్వార్జితంతో 108 బంగారు తామర పూలు చేయించి శ్రీవారి ఆలయంలో సమర్పిస్తానని మొక్కుకున్నారు. మొక్కయితే మొక్కుకున్నారు గానీ పాపం వారి ఆరోగ్యమూ అంతంత మాత్రమే ఆర్థిక స్థోమతా అంతం మాత్రంగా కావటం చేత కొద్ది మాత్రం బంగార తామరపూలు మాత్రమే చేయించగలిగారు.
 
ఆ తర్వాత తండ్రి గారి మొక్కు తీర్చే బాధ్యత తనది కూడా అవుతుంది కాబట్టి మాతండ్రిగారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్కో రూపాయి కూడా పెట్టి మరికొన్ని బంగారు పూలు చేయించారు. అంత కష్టపడి చివరగా మొక్కు తీర్చకుండానే మా తండ్రి గారు కూడా వారి తండ్రి గారి లాగానే తమ చివరిరోజుల్లో ఎంతో బాధపడ పడుతూ స్వామివారి పాదాల్లో ఐక్యమై పోయారు. మరి మా తాతగారిది తండ్రిగారిది మొక్కు తీర్చాల్సిన బాధ్యత ఇంటికి పెద్ద కొడుకుగా నా మీద ఉంటుంది. కాబట్టి నా ఆర్థిక పరిస్థితి కూడా పెద్దగా సహకరించకపోయినా నేను కూడా ఎంతో కష్టపడి నా వంతు ప్రయత్నంగా ఆ మిగతా బంగారు పూలు కూడా పూర్తి చేయించాను.
 
ఈ మధ్యనే కరెక్టుగా 108 పూల లెక్కపూర్తయ్యింది. ఎంతో భక్తితో అవి స్వామివారికి సమర్పించాలని మా కుటుంబ సభ్యులంతా మొత్తం 54 మందిని కలిసి ఇందాకే కాలిబాటన కొండెక్కిపైకి చేరుకున్నాం అంటూ కాసేపాగి అందరివైపు ఒక్క నిమిషంగా తదేకంగా చూశాడు షేక్ మస్తాన్. ఆ తరువాత మెల్లగా అసలు విషయం బయటపెట్టాడు. అయ్యా ఇప్పటికే మీ అమూల్యమైన సమయం చాలా తీసుకున్నాను. కానీ చివరగా పెద్దలందరికీ నాదొక చిన్న విన్నపం. మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులంతా ఎంతో శ్రమపడి ఈ బంగారు తామరపూలు చేయించాం. ఇవి ఒక్కోటి 23 గ్రాముల బరువుంటుంది. కాదనకుండా మీరు వాటిని స్వీకరించి ఏదో రూపేణా స్వామివారి కైంకర్యంలో ఉపయోగిస్తే మా కుటుంబం మొత్తానికి కూడా గొప్ప సాయం చేసిన వారవుతారు.
 
మా తండ్రి తాతగారి ఆత్మలు కూడా శాంతిస్తాయి. ఇది విన్నవించుకుందామనుకునే మీ దగ్గరకు వచ్చాను. ఇక మీ ఇష్టం. నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. అంటూ వినమ్రంగా అందరికీ రెండు చేతులెత్తి మరోసారి నమస్కారం చేసి అప్పుడు మెల్లగా తన సంచిని తీసి ప్రసాద్ ముందున్న టేబుల్ మీద పెట్టాడు షేక్ మస్తాన్ అనబడే ఆ అతి గొప్ప ముస్లిం భక్తుడు.
 
గుండెలు పిండేసే నిశ్శబ్దం. రాతిని కరిగించే నిశ్శబ్దం. బరువైన నిశ్శబ్దం. గుండె చెరువైన నిశ్శబ్దం. నిర్వేదమైన నిశ్శబ్దం. నిలువెల్లా మనసంతా నిశ్శబ్దం. మనసంతా నిశ్శబ్ద. మనసుని కలవరపరిచే నిశ్శబ్దం. కొన్ని క్షణాల పాటు అక్కడ ఇంతకంటే వర్ణించటానికి వీలుకాని నిశ్శబ్దం ఆవహించింది ఆ ప్రాంతంలో. అక్కడున్న వారందరూ ఓ మహాశిల్పి చెక్కేసి గదిలో వదిలేసిన మహాత్ముల శిలావిగ్రహాల్లాగా ఫ్రీజ్ అయిపోయి కూర్చున్నారు. అక్కడ గది మూలాల్లో ఏర్పాటు చేసిన ఫాన్ తిరుగుతూ శబ్దం తప్ప ఆ సమయంలో అక్కడ మరో ఇతర శబ్దం వినిపించలేదు.
 
ఎంతో సాదా సీదాగా కనబడుతూ తమ మధ్యన మామూలుగా నిలబడి ఎన్నో అద్భుత విషయాలు చెప్పిన ఆ గొప్ప శ్రీవారి ముస్లిం భక్తుడి మాటలకు చేష్టలుడిగి పోయి ఉన్నావారంతా అందరికంటే ముందు తేరుకున్నాడు ఈఓ పివిఆర్కే ప్రసాద్.
 
దివి నుంచి దేవదేవుడే దిగి వచ్చాడా.. అన్న ఒక్క అతి చిన్న అనుమానం లిప్త పాటు కాలంలో ఓ మహోగ్రరూపం దాల్చి ఆయన మనసంతా ఆక్రమించింది. ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఒక్క ఉదుటన లేచి షేక్ మస్తాన్ దగ్గరికి చేరుకున్నారు ప్రసాద్. కళ్ళ నుంచి ధారగా కన్నీళ్ళు కారిపోతుండగా షేక్ మస్తాన్ రెండు చేతులు పట్టుకుని ఎంతో ఆర్ధ్రతతో మస్తాన్ గారూ మమ్మల్ని క్షమించడం. మీరెవరో తెలియక ఇంతసేపే మిమ్మల్ని నిలబట్టే మాట్లాడించాను. రండి.. అంటూ ముందు తన కుర్చీ దగ్గరికి తీసుకెళ్ళి తన పక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టుకుని ఆ తర్వాత మెల్లగా ఇలా అన్నారు.
 
మస్తాన్ గారూ.. ఇక్కడున్న మేమంతా మా సర్వీసులో ఎంతో మంది గొప్ప భక్తుల్ని చూశాం. కానీ మీ అంతటి అద్వితీయమైన భక్తుడ్ని మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఒక రకంగా మిమ్మల్ని చూడగలగడం మా పూర్వజన్మ సుకృతం అనుకోండి. బహుశా మిమ్మల్ని ఆ శ్రీనివాసుడే మా దగ్గరికి పంపించాడేమో ఎవరికి తెలుసు. కానీ నాదొక విన్నపం. ఈ అమూల్యమైన బంగారు పూలను తితిదే తరపున ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్‌గా నేను తప్పకుండా స్వీకరిస్తాను. కానీ వీటిని స్వామివారి సేవలో వెంటనే ఉపయోగిస్తామని మాత్రం ఈ క్షణంలో మీకు మాటివ్వలేను. ఎందుకంటే పేరుకి మేము కూడా శ్రీవారి సేవకులమే అయినా ప్రభుత్వం తరపున బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం కాబట్టి మాకు కొన్ని పరిమితులుంటాయి. వాటిని అధిగమించడానికి మాకు చాలానే సమయం పడుతుంది.
 
అయినా సరే ప్రయత్నం లోపం లేకుండా నా వంతు కృషి చేసి వీలున్నంత తొందరగా మీ పని పూర్తి చేసి మీకు కబురు పెడతాను. ఏం చేస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేను. మీరు మీ అడ్రస్ ఫోన్ నెంబర్ మాకిచ్చి వెళ్ళండి మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అంతవరకూ కాస్త ఓపిక పట్టండి అంటూ షేక్ మస్తాన్ రెండు చేతులూ పట్టుకుని ఈఓ ప్రాధేయపడ్డారు. 
 
మస్తాన్ గారూ చివరగా ఒక్కమాట ప్రస్తుతం మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ మా వాళ్ళు దర్శనం వసతి ఏర్పాటు చేస్తారు. హాయిగా మీ స్వామివారిని దర్శించుకుని వెళ్ళండని చెప్పారు. ఆ తర్వాత పనులన్నీ చకాచకా జరిగిపోయాయి. ఇంకో రెండు మూడు మీటింగుల తర్వాత చివరికి శ్రీవారికి ఒక కొత్త ఆర్జిత సేవను ప్రవేశపెట్టాలని తితిదే బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ సేవలో భాగంగా స్వామివారికి వారినికి ఒకసారి అష్టోత్తర శతనామపూజ జరుపబడుతోంది. గత 30 సంవత్సరాలుగా ఈ సేవ స్వామివారికి జరుగుతోంది.