ఆదివారం, 7 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2025 (08:22 IST)

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

cpr - modi
ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరును ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు హర్షం వ్యక్తంచేశారు. రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి టీడీపీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, సీపీ రాధాకృష్ణన్ ఎంతో అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడని, ఎంతో గౌరవనీయమైన నాయకుడని కొనియాడారు. దేశానికి ఆయన సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించారని ప్రశంసించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని టీడీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 
 
ఎన్డీయే కూటమి భాగస్వామిగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ విజయానికి తమ పార్టీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలియజేశారు. రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. అలాగే, ఏపీ ఉప ముఖ్యమంత్రి పపన్ కళ్యాణ్ కూడా విషెస్ తెలిపారు. 
 
ఏపీ విద్యాశాఖామంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా రాధాకృష్ణను శుభాకాంక్షలు తెలిపారు. "అపారమైన అనుభవం, దేశసేవ పట్ల అంకితభావం కలిగిన రాధాకృష్ణన్ నాయకత్వ స్ఫూర్తికి ప్రతీక. ఆయన అభ్యర్థిత్వానికి తెలుగుదేశం పార్టీ గర్వంగా మద్దతు ఇస్తోంది. ఆయన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాం" అని లోకేశ్ అన్నారు.
 
ఇదిలావుంటే, మహారాష్ట్ర గవర్నర్ కొనసాగుతున్న సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిగా ఆదివారం ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
 
రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన జార్ఖండ్ గవర్నర్, 1998 నుంచి 2004 వరకు లోక్‌సభ సభ్యుడిగా కూడా పనిచేశారు. లోకసభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు సంఖ్యాబలం స్పష్టంగా ఉంది. సుమారు 422 మంది సభ్యుల మద్దతు ఉండటంతో రాధాకృష్ణన్ విజయం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
ఈ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ఆగస్టు 7న విడుదల చేసింది. దీని ప్రకారం, సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ కాగా, ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 25న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. 
 
మరోవైపు, ప్రతిపక్ష ‘ఇండియా' కూటమి కూడా తమ తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఎన్డీఏకు ఉన్న బలమైన సంఖ్యాబలం ముందు ప్రతిపక్ష అభ్యర్థి గెలుపు కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.