వీరప్పయాచారిగా పేరు మార్చబడ్డ వీరంభొట్లయ్య గారు, ఆనందభైరవయోగికి కర్తవ్యబోధ చేసి పంపించివేసిన తరువాత, హరిహరపురంను వీడి హంపి, అహోబిలం మొదలగు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ బనగానపల్లె అనే ఒక కుగ్రామానికి చేరుకున్నారు. స్వామి వారు ఆ గ్రామంలో అన్ని చోట్లా తిరిగి తిరిగి, రాత్రి అయ్యేసరికి గరిమ రెడ్డి అచ్చమ్మ గారి ఇంటి గట్టు మీద చేరి నిద్రించారు.
మరుసటి రోజు తెల్లవారుజామున బయటకు వచ్చిన ఇంటి యజమానురాలైన అచ్చమ్మ పిచ్చివాడి వలే ఉండి తననే చూస్తున్న స్వామివారిని చూచి తమరు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? ఏమి కావాలి? అని అడిగింది. దానికి ప్రతిస్పందనగా స్వామివారు, అమ్మా! మీరు ఈ ఊరిలో ధనవంతులని, దయార్ద్ర హృదయులని విన్నాను. నన్ను వీరప్పయాచార్యులని అంటారు, నాకు వీరంభొట్లయ్య అనే పేరుకూడా ఉంది, మాది బ్రహ్మండపురం, ఇల్లు వదిలి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను, ఇక్కడి ప్రదేశము, వాతావరణము నాకు అనుకూలముగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి. అందుకే ఈ గ్రామంలో ఉండదలచాను. నాకు ఆవులమందలు కాయడం లోను, వాటి బాగోగులు చూడటం లోను, వాటికి జబ్బులు వస్తే, చికిత్స చేయడంలోను ప్రావీణ్యం ఉంది, మీరు అనుమతిస్తే మీ గోవులను కాస్తూ ఇక్కడ ఉంటాను. ప్రతిఫలంగా పట్టెడన్నం మూటకట్టి మంద తోలుకెల్లేటప్పడు ఇవ్వండి చాలు, ఇంటికి వచ్చిన తరువాత పాలు తాగడానికి ఇవ్వండి. ఇంకే బక్ష్యము ఇవ్వనవసరమ లేదు అని సెలవిచ్చారు. దానికి ఆమె అంగీకరించి తన ఇంట చోటు నిచ్చింది.
వీరప్పయాచార్యలవారు రవ్వలకొండ వద్దకు ఆవుల మందను తోలుకు పోయి, ఒక చోట గుంపుగా వాటిని నిలిపి, చుట్టూ ఒక గీత గీసి ఆ చట్రంలో వాటిని ఉండమని ఆదేశించి, గృహలోనికి ప్రవేశించారు. సంధ్య వేళ అయిన తరువాత ఆవులమందను ఇంటికి తోలుకొని వచ్చి, అచ్చమ్మ గారు ఇచ్చిన పాలు తీసుకుని, తన పూజాది కార్యక్రమములలో నిమగ్నమైపోయారు. రోజూ ఇదేవిధంగా ఆవుల మందను రవ్వలు కొండ వద్ద కాస్తూ ఇంట పూజా కార్యక్రమములు జరుపుకుంటూ, తన వద్దకు వచ్చిన వారికి సద్బోధలు చేస్తూ గడపడం అతని దినచర్యగా మారింది. రోజురోజుకూ తన ఆవులు ఊరిలో ఇతరుల ఆవులు కంటే పుష్టిగా తయారయి ఎక్కువ పాలు ఇవ్వసాగాయి.
అచ్చమ్మ స్వామివారి మహిమలు చూచుట
ఒక రోజు కొంతమంది బనగానపల్లె వాసులు, రవ్వల కొండ వద్ద గుంపుగా ఉన్న ఆవుల మందను చూసారు. కనుచూపుమేరలో ఆవులు కాపరి కనిపించలేదు ఎక్కడా. ఆవులు చూస్తే పుష్టిగా, పుష్కలంగా పాలిచ్చేవిలా కనిపిస్తున్నాయి. ఇదే మంచి సమయం అనుకొని వాటిని అదిలించారు. అవి ఏమాత్రం వాటి స్థానాలనుండి కదలలేదు. వాళ్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆవులు చెదరలేదు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూసారు. ఆవులన్నీ గుండ్రంగా గీసిన గీతలో ఉండి ఎటువంటి క్రూరమృగాల భయం లేకుండా చక్కగా అక్కడున్న పచ్చిక మేస్తున్నాయి. ఆ గీయబడ్డ చట్రం నుండి వాటిని బయటకు తెస్తే గాని ఆవుల్ని తోలుకెళ్లలేమని తలంచి, వాళ్లే ఆ వలయము లోనికి వెళ్లారు. లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్లు కళ్లు కనిపించడం మానేసాయి. అంతా అంధకారమయమయింది, ఒళ్ళoతా భగభగ మంటలెక్కాయి.
లోపలుంటే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో అని భయపడి అమాంతం ఆ చట్రం నుండి బయటకొచ్చారు. బయటకు వచ్చిన తరువాత మళ్లీ ఆవులు వంక చూసారు. అవి ఎప్పటిలాగే పచ్చిక మేస్తున్నాయి. వాళ్లు అవి అచ్చమ్మ గారి ఆవులని గ్రహించారు. అచ్చమ్మ ఎవరో పైవూరివాడిని ఆవులు కాపరిగా పెట్టుకుందని విన్నారు. ఈ కాపరి ఎవడో టక్కుటమారవిద్యలు తెలిసిన వాడిలా ఉన్నాడు. అచ్చమ్మకి చెప్పి వీడిని పని నుండి మాన్పించేయాలని అనుకున్నారు. అందరూ కూడబలుక్కుని అచ్చమ్మ ఇంటికి వెళ్లి, వారిమిద నింద పడకుండా జాగ్రత్త పడుతూ జరిగిందానికి కొంత కధ అల్లి చెప్పారు.
మరుసటిరోజు ఆవులు మందతో స్వామివారు వెలుతుంటే, వెనుక గరిమ రెడ్డి అచ్చమ్మ నక్కి నక్కి కదిలింది, కాలజ్ఞానికి ఆమాత్రం తెలియదా, అయితే ఏమీ తెలియనట్లే వెల్తూ యధావిధిగా రవ్వలకొండ చేరి, ఆవుల చుట్టూ వర్తులాకారముగా గీరు గీసి, అందులో వాటిని ఉండమని ఆజ్ఞాపించి, గుహలోనికి వెల్తూ, ప్రవేశ ప్రాంతంలో ఉన్న తాటి చెట్టు వంగగా, ఆ చెట్టునుండి తనకు కావలసిన తాటి రేకులు కోసుకుని లోనికి ప్రవేశించారు. స్వామివారు లోపలికి వెళ్లిన వెంటనే తాటి చెట్టు యధావిధిగా నిటారుగా అవడాన్ని, సంభ్రమాశ్చర్యాలతో తిలకించి, అచ్చమ్మ గుహ బయటనుండి తొంగి తొంగి స్వామివారు చేస్తున్న పనిని చూడసాగింది. స్వామి వారు లోపలికి వెళ్లి, అనుకూలముగా ఉన్న ఒక బండపై సుఖాసీనులై, గుహ వెలుగులు చిమ్ముతుండగా, ఒక గులజారి ముల్లుతో కాలజ్ఞానాన్ని రాయసాగారు.
ఆ దృశ్యo గరిమరెడ్డి అచ్చమ్మకి శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపైన కూర్చొని ధగధగాయమానముగా ప్రకాశిస్తూ సృష్టి లీలలు రాస్తున్నట్లు కనిపించడంతో, ఆమె స్వామి వద్దకు పరుగున పోయి పాదాల వద్ద సాష్టాంగ పడి, అనుమానించి తెలియకుండా వెన్నంటి వచ్చినందుకు పరిపరి విధాలుగా క్షమించమని వేడుకుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆమె వంక వాత్సల్యంగా చూస్తూ అంతా దైవలీల, నేను భవిష్యత్ సంఘటనలు రాయడానికి ఈ ప్రశాంత స్థలమునెంచుకున్నాను, కాలక్రమమున నేను రాస్తున్న గ్రంధము కాలజ్ఞానము, బ్రహ్మం గారి కాలజ్ఞానముగా స్తుతించబడతుంది అని చెప్పి ఆ పుణ్యవతికి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనే మహా మంత్రాన్ని ఉపదేశించారు.
స్వామి వారు బ్రహ్మానందరెడ్డి, అన్నాజయ్యలను అనుగ్రహించుట:
వీరబ్రహ్మేంద్రస్వామివారు ,తాను కాలజ్ఞానం రాసిన రేకులను అచ్చమ్మ ఇంటి వద్ద ఉన్న ఒక పాడుబడ్డ పాతరలో వేసి బండతో కప్పేవారు. కాలక్రమాన ఒక చింతచెట్టు దానిపై మొలచి ఇప్పటికీ దివ్య వృక్షమై పూజలందుకుంటుంది. బనగానపల్లెలో అచ్చమ్మ స్వామివారికోసం ఒక మఠాన్ని కట్టిoచారు. అందులో ఉండి వీర బ్రహ్మేంద్రస్వామి వారు భక్తులకు జ్ఞాన బోధ, తత్వ బోధ చేసేవారు. ఒక రోజు అచ్చమ్మ తన అంధుడైన పుత్రుని స్వామి అనుజ్ఞ మేరకు తీసుకుని వచ్చింది. స్వామివారు అచ్చమ్మ కుమారుడైన బ్రహ్మేంద్ర రెడ్డి భృకుటి మధ్యన తన బొటన వేలిని పెట్టి నొక్కి పెట్టి, కన్నులను ఒక్కసారి మూసి తెరువు అని ఆదేశించారు.
అలా చేసేసరికి అచ్చమ్మ కుమారుడికి చూపు వచ్చింది. దానితో అతని ఆనందానికి అవధులు లేవు. స్వామి వారి పాదాలపై సాష్టాంగ పడి, శిష్యునిగా చేసుకోమని ప్రాధేయపడ్డాడు. స్వామివారు కరుణించి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. అచ్చమ్మ కుమారుడైన బ్రహ్మేంది రెడ్డి తదుపరి జీవితమంతా వీరబ్రహ్మేంద్రస్వామి వారి సేవకు అంకితం చేసాడు. శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారిని నమ్ముకున్న వారికి జీవితం వెలుగులుతో నిండి ఉంటుందని స్వామి వారు బ్రహ్మేంద్ర రెడ్డికి కళ్ళు తెప్పించడం ద్వారా మరోమారు నిరూపించారు.
అదేరోజున అన్నాజయ్య అనే తాపసి స్వామివారిని వెతుక్కుంటూ వచ్చి ఆయన పాదాలపై పడి దైవ స్వరూపులైన మిమ్మల్ని సేవించే భాగ్యం ప్రసాదించండి అని అర్థించాడు. స్వామి వారు కరుణించి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి, అక్కడే ఉన్న బ్రహ్మేంద్రరెడ్డి వైపు తిరిగి, నీవు, తల్లిగారు, అన్నాజయ్య కలిసి మఠము కార్యక్రమములు నిర్వర్తిస్తూ జీవించండి అని ఆదేశించారు. (ఇంకా వుంది)
- కొమ్మోజు వెంకటరాజు