గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (13:15 IST)

శ్రీకాళహస్తిలో శివయ్య సేవకులేరీ..!

తిరుమలలో రోజూ వెయ్యిమందికిపైగా శ్రీవారి సేవకులు వేంకటేశ్వరస్వామి భక్తులకు సేవలందిస్తుంటారు. ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ నుంచి దర్సనం కోసం వేచి ఉండే భక్తులకు ఆహారం, నీళ్లు అందించడం, పూలు కట్టడంలో సహరించడం

తిరుమలలో రోజూ వెయ్యిమందికిపైగా శ్రీవారి సేవకులు వేంకటేశ్వరస్వామి భక్తులకు సేవలందిస్తుంటారు. ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ నుంచి దర్సనం కోసం వేచి ఉండే భక్తులకు ఆహారం, నీళ్లు అందించడం, పూలు కట్టడంలో సహరించడం, అన్నప్రసాద కేంద్రంలో కూరగాయలు తరగడం, భోజనాలు వడ్డించడం.. ఇలా అన్ని పనులు చేస్తుంటారు. తితిదే అనుబంధ ఆలయాల్లోనూ శ్రీవారి సేవకులు పనిచేస్తుంటారు. ఆఖరికి తిరుపతిలోని తితిదే గోశాల, తితిదే అనుబంధ ఆసుపత్రుల్లోనూ సేవలు అందిస్తున్నారు. తితిదేలో శ్రీవారికి సేవకులు అత్యంత కీలకంగా మారారు. ఈ సేవకుల వల్ల తితిదే పని ఎంతో సులభమైంది. భక్తులకూ మెరుగైన సేవలు అందుతున్నాయి. ఒక్కో బృందం 10 రోజుల పాటు ఇక్కడే ఉండి సేవలు చేసి వెళుతుంటుంది. పుట్టపర్తిలోనూ సాయిసేవకులు ఇలాగే భక్తులకు సేవలందిస్తుంటారు.
 
తిరుమల, పుట్టపర్తి అనుభవాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల్లోనూ సేవకుల వ్యవస్థను ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం ఇలా ప్రముఖ ఆలయాల్లో ఎక్కడైనా సేవ చేయడానికి ఆశక్తి ఉన్న భక్తులు ఒక బృందంగా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారికి స్థానికంగా బస, భోజన వసతి కల్పించి ఆలయంలో సేవ చేసే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఆలోచనలో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలాయంలో శివయ్య సేవకులు వస్తారని ఆశించారు. ఇప్పటిదాకా అలాంటి జాడ ఎక్కడా కనిపించడం లేదు.
 
శ్రీకాళహస్తికి వచ్చే భక్తుల సంఖ్య రానురానూ పెరుగుతోంది. రోజూ 20 వేల నుంచి 30 వేల మంది దాకా స్వామివారి దర్శనానికి వస్తున్నారు. క్యూలైన్లలోనే గంటల సమయం పడుతోంది. ఆ సమయంలో భక్తులకు తాగునీళ్ళు అందించే వాళ్లూ లేరు. ఆలయ ఉద్యోగులతో అందరికీ అలాంటి సేవలు అందించడం సాధ్యం కాదు. ప్రభుత్వం కంటే ఆయా ఆలయాలే చొరవ తీసుకుని సేవకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. శ్రీకాళహస్తిలో అలాంటి ప్రయత్నమే జరుగుతున్న దాఖలాలు లేవు. మాస్టర్‌ ప్లాన్‌ అంటూ కుంబాభిషేకమంటూ హడావుడి చేస్తున్నారు గానీ తక్షణం అవసరమైన శివయ్య సేవక బృందాల నియామకంపై శ్రీకాళహస్తి ఆలయ అధికారులు దృష్టి పెట్టడం లేదు.
 
శివయ్య సేవకులుగా పేర్లు నమోదు చేసుకోమని సూచించేవారు ఆలయంలో లేరు. కనీసం అలాంటి హోర్డింగులు కూడా ఎక్కడా కనిపించవు. శివయ్య సేవకులుగా ఎలా నమోదు చేసుకోవాలో వివరిస్తూ ఒక కరపత్రం ప్రచురించి ఆలయానికి వచ్చే భక్తులందరికీ పంపిణీ చేసినా ప్రయోజనం ఉంటుంది. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వచ్చే ఆర్టీసీ బస్సుల్లో అలాంటి స్టిక్కర్లు అంటించినా చాలా మందికి తెలుస్తుంది. ఇవేవీ అధికారులకు పట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో శివయ్య సేవకులు ఎలా వస్తారు. ఎవరైనా సేవ చేయాలని వచ్చినా ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి.
 
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. పర్యాటక కేంద్రాల అభివృద్ధిలో భాగంగా ఆలయానూ అభివృద్ది చేయాలనుకుంటోంది. ఆలయాల ద్వారా దేశంలోని పర్యాటకులను ఆకర్షించాలని భావిస్తోంది. అదే విధంగా పేదలకు ఉచితంగా తీర్థయాత్రల పథకాన్ని ప్రారంభిస్తోంది. ఏ విధంగా చూసినా భవిష్యత్తులో ఆలయాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో తిరుమల తరువాత అంతటి ప్రాధాన్యత శ్రీకాళహస్తికి ఉంది. తిరుమల వ్చే భక్తులంతా శ్రీకాళహస్తిని దర్శించడానికి ఆశక్తి చూపుతున్నారు. అందుకే అంతగా రద్దీ పెరుగుతోంది. 
 
ఈ పరిస్థితుల్లో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలంటే శివయ్య సేవకుల నియామకం తప్పనిసరి. శివయ్య సేవకులు వస్తే క్యూలైన్ల నిర్వహణతో పాటు అన్నదాన సత్రంలోనూ వారి సేవలు వినియోగించుకోవచ్చు. దేవదాయశాఖ ఉన్నతాధికారులు దీనిపై సమీక్షించేదాకా కాలయాపన చేయకుండా వెంటనే శివయ్య సేవకుల నియామకంపై అధికారుల దృష్టి సారించాలి. ఇందులో భాగంగా ముందుగా శివయ్య సేవకులుగా పేరు నమోదు చేసుకోమంటూ భక్తులను అభ్యర్థిస్తూ ఆలయంలో ప్రచారం చేపట్టాలి.