శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 5 మే 2021 (23:31 IST)

సర్వ సమర్థుడు సద్గురు సాయినాధుడు

1. పరిశోధించు--సాధించు
2. విశ్లేషించు---వివేచించు
3. పరిశీలించు--విశ్వసించు
4. శరణుపొందు--సేవించు
5. శ్రమించు---పంచు
6. ఆచరించు--భోదించు
7. ప్రేమించు---పంచు
 
వీటిని గురించి పూజ్య శ్రీ మాస్టారుగారు యిలా వివరిస్తూ ఉండేవారు.
1. పరిశోధించు-సాధించు- దేనిని గురించియైనా నిశితంగా, నిష్కర్షగా పరిశోదించు. దాని తత్త్వాన్ని గురించి లోతుగా ఆలోచించు. అప్పుడు దాని తత్త్వం అవగతమవుతుంది. అయితే ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి పట్టువిడవకుండా ప్రయత్నించాలి. మూలాన్ని తెలుసుకోవాలి. మూలాన్ని తెలుసుకున్నట్లు గుర్తు ఏమిటంటే ఆ విషయంలో ఇక సందేహముండదు. మనస్సు శాంతిని పొందుతుంది.
 
2. విశ్లేషించు-వివేచించు...జీవితంలో జరిగే సంఘటనల గూర్చి విశ్లేషించు. అంటే సంఘటనలలోని, పరిస్థితులలోని మంచిచెడులు., పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తరువాత వివేకంతో ఆలోచించాలి. అంటే వాటిలోని సత్యాసత్యాలను గూర్చి నిష్కర్షగా, స్వార్ధరహితంగా ఆలోచించాలి.అప్పుడే సరియైన అవగాహన కలుగుతుంది. సరియైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము కూడా.
 
3. పరిశీలించు-విశ్వసించు...ఈ విషయమై ఆయన ఒకసారి ఇలా చెప్పారు. జన్మనెత్తినందుకు గురువును తెలుసుకోవాలి. లేకపోతే ఎందుకు వచ్చినట్లు. పిడకలు ఏరుకోవడానికా.. అని బాబా చెప్పారు. కనుక మానవ జన్మనెత్తినందుకు తప్పకుండా గురువును తెలుసుకోవాలన్నమాట. అయితే గురువుని తెలుసుకునేదెలా... అందుకు మొదట సద్గురువులు ఎలా ఉంటారో, వారి లక్షణాలేమిటో సంపూర్ణంగా తెలుసుకోవాలి. అట్టి లక్షణాలు అవతలి వ్యక్తిలో, అంటే గురువుగా పెట్టుకోవాలి అనుకునే వారిలో ఉన్నాయో లేదో నిశితంగా పరిశీలించాలి. 
 
ఎన్ని విధాలుగానైనా అట్టి వారిని పరీక్షచేసుకోవచ్చు. అందుకు ఎంతకాలమైనా తీసుకోవచ్చు. మనం దేనినైనా అంటే కూరగాయలనైనా సరే కొనడానికి వెళ్ళినప్పుడు అవి సరియైనవి అవునో కాదో అని ఎంతగానో పరిక్షిస్తాము కదా. అలాగే ఒక పెళ్ళి సంబందం చూడాలంటే ఎంతగానో అవతలి వారి వివరాలగూర్చి విచారిస్తాముగదా. అలాంటప్పుడు మన జీవితాన్ని సద్గురువుకి అప్పగించాలని తలచినప్పుడు ఎంతగానో పరిశీలించవలసిన అవసరమున్నది. అందుకని అప్రమత్తత లేకుండా క్షుణ్ణంగా అనుమానం లేని విదంగా పరీక్షించిన తరువాతనే గురువుగా ఎన్నుకోవాలి.
 
అయితే సరియైన గురువుని ఎన్నుకోవడానికి మన పరిజ్ఞానం చాలదు. కనుక సద్గురువు లభించాలని శ్రీ గురుచరిత్ర శ్రద్ధగా పారాయణ చేస్తే శ్రీ దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి మనకు తెలుపుతారు. అప్పుడు అట్టి గురువుని ఆశ్రయించడం సరియైన పద్దతి. సద్గురువుని తెలుసుకున్న తరువాత వారిని తన గురువుగా భావించిన తర్వాత ఆయనను సంపూర్ణంగా విశ్వసించాలి. గురువు ఎంతటివారో గుర్తు పెట్టుకుని మనసు సడలకుండా జాగ్రత్త వహించాలి. ఆయన సర్వజ్ఞుడని. సర్వసమర్ధుడని మన ఐహిక ఆధ్యాత్మిక శ్రేయస్సు చేకూర్చే వారని సంపూర్ణంగా విశ్వసించాలి.