శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 జనవరి 2017 (17:20 IST)

దేహాన్ని దేవాలయంలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. ''T'' రాష్ట్రాల్లో రామానుజ విగ్రహాల ఏర్పాటు: శ్రీ చిన్న జియ్యర్ స్వామి

దేహాన్ని దేవాలయంగా భావించి నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని జియ్యర్‌ స్వామి తన ప్రవచనంలో చెప్పారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామి వారి మంగళాశాసనాలతో శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్వంలో మంగళవారం (జనవరి 10న) ప్రారంభం అయిన ఆధ్యాత్మిక ప్రవచన సదస్సుకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో శివారు నగరం ఫోల్సం వేదిక అయ్యింది. ఫోల్సం నగరంలో విస్టా డీలాగో హైస్కూల్ ప్రాంగణంలో అణువణువునా ఉట్టిపడిన ఈ ఆధ్మాత్మికత సదస్సుకు స్థానిక తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 
 
మొదట జియ్యర్‌ స్వామి వారి కి TAGS చైర్మన్ వెంకట్ నాగం పూర్ణకుంభంతో సాంప్రదాయబద్దంగా స్వాగతం చెప్పారు. పిదప జియ్యర్‌ స్వామి వారిని TAGS అధ్యక్షులు మనోహర్ మందడి పూలమాలతో అలంకృతం గావించారు. అనంతరం రెండు గంటలకు పైగా సాగిన జియ్యర్‌ స్వామి ఆధ్మాత్మిక ప్రసంగంతో ఆహుతులు తడిసి ముద్దయ్యారు. దేహాన్ని దేవాలయంగా భావించి నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని జియ్యర్‌ స్వామి తన ప్రవచనంలో చెప్పారు. 
 
‘ప్రజ్ఞ ‘ ని స్థాపించి వేలాది మంది పిల్లలందరికీ శ్లోకాలు, భారత, రామాయణం కథలు, వేదాలు నేర్పించడం జరుగుతున్నదని, ఉచ్ఛారణలో తప్పులు లేకుండా శ్రద్ధగా నేర్చుకొంటే వాటి ఫలితం పూర్తిగా పొందవచ్చునని, అయితే ఈ విషయంలో ప్రవాసాంధ్రులు పిల్లలకు సహకరించాలని చిన్న జియ్యర్ స్వామి వివరించారు. 
 
అతి సామాన్యుడికి సైతం ఆలయ ప్రవేశం కలిగేలా చేసి సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆరాధనా విధానాన్ని క్రమబద్దీకరించి నిత్యం లక్షలాది భక్తులు ఆ కలియుగ ప్రత్యక్షదైవాన్ని దర్శించుకునేలా చేసిన సమతామూర్తి శ్రీ రామానుజచార్య ప్రాభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయడంతో పాటుగా ఆయనను భావితరాల వారికి పరిచయం చేయాలనే సత్సంకల్పంతో సుమారు 600 కోట్ల రూపాయలతో శ్రీమద్రామానుజ స్ఫూర్తి కేంద్రం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో నిర్మించనున్నట్లు చిన్నజియ్యర్ స్వామి చెప్పారు.
 
సమాజ సంస్కరణాభిలాషతో వందల ఏళ్ళ క్రితమే సమాజంలో కులతత్వ నివారణకు కృషిచేసి, సమాజానికి ఆధ్యాత్మిక సుగంధం పూసే పలు విశిష్టమైన గ్రంథాలను రచించి, తన బోధనలతో.. రచనలతో సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన మహనీయుడు శ్రీ భగవద్రామానుజస్వామి వారు. ఆ మహానుభావుడు జన్మించి 2017 నాటికి వెయ్యేళ్ళవుతున్న విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ప్రవచనాలను ప్రపంచానికంతా పున:పరిచయం చేయాలనే సదాశయంతో శ్రీ త్రిదండి చిన్న శ్రీమ న్నారాయణ రామానుజ జియ్యర్‌స్వామి వారు తాము చేస్తున్న ప్రయత్నాన్ని సోదాహరణంగా వివరించారు.
 
ఈ బృహత్‌ కృషిలో భాగంగా, హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌ ఆశ్రమంలో సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో 216 అడుగులు ఎత్తున శ్రీ రామానుజస్వామివారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు చెప్పారు. 'స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ' పేరుతో ఇంత భారీఎత్తున నిర్మించే ఆ 'సమతామూర్తి' విగ్రహం ఏర్పాటుకే కనీసం నూరుకోట్ల రూపాయల దాకా వ్యయమవుతుందని, ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల దాకా వ్యయమవుతాయని చెప్పుకొచ్చారు. 
 
మూడు దశల్లో జరిగే ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని చిన్నజియ్యర్‌ స్వామివారు చెప్పారు. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రీ రామానుజుల స్వామి వారి దివ్యక్షేత్రాలు వుండాలనే ఆకాంక్షతో విజయవాడలోని విజయ కీలాద్రి పర్వతంపై కూడా 108 అడుగుల ఎత్తయిన శ్రీ రామానుజుల స్వామివారి సుధామూర్తి (సిమెంట్‌ విగ్రహం) ఏర్పాటుకు కూడా కృషి జరుగుతున్నదని జియ్యర్‌స్వామి చెప్పారు. కార్యక్రమం పిదప వేణు మెప్పర్ల ఆధ్వర్వంలో భక్తులకు ప్రసాదాలు TAGS కార్యకర్తలు అందజేశారు.