శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (13:29 IST)

ముక్కంటీశుని ప్రసాదం కాస్త పెట్టండి.. ప్లీజ్‌..

దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయ ఆదాయం 80 కోట్ల రూపాయలు దాటింది. 100 కోట్ల రూపాయల దిశగా పరుగులు తీస్తోంది. రోజూ వేల సంఖ్యలో భక్తులు ముక్కంటీశుని దర్శించుకుంటున్నారు.

దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయ ఆదాయం 80 కోట్ల రూపాయలు దాటింది. 100 కోట్ల రూపాయల దిశగా పరుగులు తీస్తోంది. రోజూ వేల సంఖ్యలో భక్తులు ముక్కంటీశుని దర్శించుకుంటున్నారు. అంతటి ఆదాయాన్ని తెచ్చపెడుతున్న భక్తులకు కనీసం ఉచిత ప్రసాదమైనా దక్కడం లేదు. ఆలయం తరపున ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తున్నా అది కొంతవరకే. భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా ఉచిత ప్రసాదాల పరిమాణం పెరగకపోవడంతో చాలా మంది కనీసం ప్రసాదం లేకుండానే వెనుదిరుగుతున్నారు. దీంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్వర్యంలో భక్తులకు ఉప్పు, పొంగలి, బెల్ల పొంగలిని ఉచిత ప్రసాదంగా అందజేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం 4 గంటల నుంచి 6.30గంటల వరకు ఉచిత ప్రసాదం ఇస్తున్నట్లు చెబుతున్నారు. రోజూ 50 కేజీల బియ్యంతో ప్రసాదాలు తయారు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఉదయం పూట 30 కేజీల బియ్యంతో పాటు 3.50 కేజీల నెయ్యి, 3.50 కేజీల పెసరపప్పుతో పాటు మిరియాలు, జిలకర, అల్లం, పచ్చిమిరప ఉపయోగిస్తున్నారు. 
 
అలాగే సాయంత్రం బెల్లం పొంగలి తయారు చేస్తారు. దీనికి 20 కేజీల బియ్యం, 20 కేజీల బెల్లం, 3.50 కేజీల నెయ్యి, యాలకుల పొడి ఉపయోగిస్తున్నారు. ఆలయ ఉద్యోగులు చెబుతున్న లెక్కలకు భక్తులకు అందుతునన్న లెక్కలకు పొంతన లేకుండా పోతోంది. ఉదయం పూట, మధ్యాహ్నం ఒంటిగంట దాకా ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు చెబుతున్నా 11.30 నుంచి 12గంటలకే ప్రసాదాల కౌంటర్‌ మూసేస్తున్నారు.
 
శని, ఆది, సోమ వంటి రద్దీ రోజుల్లో కనీసం రెండు గంటలు కూడా భక్తులకు ఉచిత ప్రరసాదం ఇవ్వలేని పరిస్థితి. తిరిగి సాయంత్రం 4గంటల నుంచి బెల్లం, పొంగళి పంపిణీ కన్నా బెల్లం పొంగలి కాస్త రుచికరంగా ఉంటుంది. అయితే ఈ ప్రసాదం 20 కేజీలు మాత్రమే తయారు చేస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు ముక్కంటి ఆలయానికి విచ్చేస్తున్నా ఉచిత ప్రసాదం అందుతోందా అనేది అనుమానమే. 
 
15 వేల మంది భక్తులు వచ్చిన రోజు ఒకే దిట్టం. 30వేల మంది భక్తులు వచ్చిన రోజూ ఒకే దిట్టం అంటే ఎలా సరిపోతుందో అధికారులు ఆలోచించడం లేదు. ఆలయంలో పెరుగుతున్న రద్దీకి తగ్గట్టుగా ప్రసాదాల తయారీ దిట్టం పెరగకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఉచిత ప్రసాదం అయిపోతే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. ప్రసాదాలు కొనుగోలు చేయగల శక్తి ఉన్నా ఆలయంలో దేవునికి నైవేథ్యంగా సమర్పించిన ప్రసాదం ఆరగించాలన్న కోరిక భక్తులకు ఉంటుంది.
 
ముక్కంటి ఆలయంలో భక్తులకు ఉచితంగా అందిస్తున్న ప్రసాదంలో నాణ్యత పెద్దగా పాటించడం లేదనే విమర్శలున్నాయి. తగిన పరిమాణంలో అన్ని సరుకులు వినియోగిస్తే ఏ ప్రసాదమైనా రుచిగా, నాణ్యంగా ఉంటుంది. ఉచిత ప్రసాదాల్లో అవసరమైన మేరకు సరుకులు వాడటం లేదని తెలుస్తోంది. పాలకమండలి సమావేశాలు జరిగేటప్పుడు బెల్లం పొంగలికి ఎంతో తేడా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతోందనేది ప్రశ్న. ఇందులో మరింత నెయ్యి, జీడిపప్పు వేసి తయారు చేస్తారు. అందుకే ప్రత్యేకంగా తయారు చేసే ప్రసాదం రుచిగా ఉంటుంది. ఉచితంగా పంపిణీ చేసే ప్రసాదాల తయారీలోను ఇంత శ్రద్ద తీసుకుంటే అవీ రుచిగానే ఉంటాయి.
 
తితిదే ఆలయాల్లో భక్తులకు దర్శనం ఉన్నంతసేపూ ఏదో ఒక ప్రసాదం అందజేస్తుంటారు. అన్న ప్రసాదాలు అయిపోతే. కలకండ అయినా పంపిణీ చేస్తుంటారు. స్వామిని దర్శించుకునే ప్రతి భక్తునికీ ప్రసాదం ఇవ్వాలన్నదే దీని ఉద్దేశం. శ్రీకాళహస్తి ఆలయంలో ఆ పద్ధతి లేదు. కోట్ల రూపాయల ఆదాయం ఆలయానికి వస్తున్నదంటే అది భక్తుల ద్వారానే. అలాంటి భక్తులకు ఆలయం తలుపులు తీస్తున్నంత సేపు ఉచిత ప్రసాదం అందించడం శ్రీకాళహస్తి దేవస్థానానికి పెద్ద భారమేమీ కాదు. భక్తులకు అది చేస్తాం. ఇది చేయాలని అని ఏవేవో ప్రణాళికలు రూపొందిస్తుంటారు. దర్శనానంతరం భక్తులకు ప్రసాదం ఇవ్వాలన్న సంగతి మాత్రం పట్టించుకోరు. ఇకనైనా ఉచిత ప్రసాదాలు ఏయే రోజల్లో ఎంతమందికి అందుతున్నాయి. ఎందరు ప్రసాదాలు అందక నిరాశతో వెనుతిరుగుతున్నారో పరిశీలించి ప్రసాదాల తయారీ పరిమాణం పెంచాలి. అదేవిధంగా రుచిగా ఉండటానికి అవసరమైన చర్యలూ చేపట్టాలి.