గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 10 ఏప్రియల్ 2019 (22:25 IST)

శిరిడీ హారతుల ప్రత్యేకత ఏంటి?

నాగపూర్ జిల్లాలోని బోరీ గ్రామస్థుడు కృష్ణ శాస్త్రి జగేశ్వర్ భీష్మకు 1908 శ్రావణ మాసంలో ఒక రాత్రి స్వప్నంలో ముఖాన త్రిపుండ్రం, ఒంటి నిండా చందనము కల ఒక నల్లని బ్రాహ్మణుడు కనిపించి ఒక వార్తాపత్రిక చూపించాడు. దానిపై .. సచ్చిదానంద... అనే అక్షరాలు తరువాత మంత్రము వాశికావా( మంత్రము మరియు నేర్చుకో) అన్న వాక్యం కనిపించగానే కల ముగిసింది. 
 
ఆ కల గురించి అతడు ఒక సాధువుని అడిగితే, సచ్చిదానంద స్వరూపి అయిన సద్గురువే అతనిని అనుగ్రహించగలడన్నా దివ్య సంకేతమే ఆ స్వప్నం అని చెప్పాడు. కొంతకాలానికి అతడు దాదాసాహెబ్ ఖాపర్దేతో కలిసి శిరిడి వెళ్లాడు. బాబా అతనిని చూస్తూనే జై సచ్చిదానంద అని నవ్వుతూ చేతులు జోడించారు. అయినా శ్రీ సాయి ముస్లిం అన్న అనుమానం భీష్మాను బాధిస్తుండేది. 
 
ఒకరోజు సాయి అతనికి చిలుం ఇచ్చి సర్వత్రా నేనే ఉండాను. అంతా రామమయమే తెలిసిందా మిత్రమా... సరేగానీ నాకు అయిదు లడ్లు పెడతావా అన్నారు బాబా. తనకు స్యప్న దర్శనం తెలిపినట్లు సచ్చిదానంద స్వరూపి అయిన సాయి తన సద్గురువు అని అతడు తెలుసుకున్నాడు. కానీ బాబా తనని లడ్లు అడగడంలోని భావం ఏమో బీష్మాకు తెలియలేదు.
 
తెల్లవారగానే అతని హృదయంలో కవితా పెల్లుబికి మరురోజుకల్లా అయిదు హారతి పాటలు దొర్లాయి. అప్పటి నుండి మొదట మేఘుడు, తరువాత భాపూ సాహెబ్ జోగ్ నిత్యము నాలుగు వేళలా సాయి సన్నిధిలో ఈ పాటలతో బాబాకు హారతి ఇవ్వసాగారు. తరువాత దాసగణు మహారాజ్ కొద్ది పాటలు చేర్చి, ఈ హారతులను సర్వాంగసుందరంగా చేశాడు. వీటినే శ్రీ సాయినాధ సగుణోపాసన అను పేర సాయి సంస్థానం వారు 1923లో ముద్రించారు. 
 
ఈ హారతి పాటలు కొన్నింటిలో కృష్ణా అని, కొన్నింటిలో గణూహ్మణే అన్న పదాలు అందుకే వినిపిస్తాయి. ఈ విధంగా బీష్మ చేత ఎంతో ప్రేమగా శిరిడీ సాయినాధుడు శిరిడీ హారతులు స్వయంగా రాయించుకున్నారు. అందుకే వీటిని భావమెరిగి పాడుకొనడం ఎంతో శ్రేయస్కరం.