శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 మే 2017 (10:40 IST)

శ్రీవారి తిరుమల కొండలపై వెలసిన కపిలేశ్వర స్వామిని దర్శించుకుంటే?

తిరుమల వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడు కొండలపై వెలసిన శ్రీవారి ఆలయం.. దాని చుట్టూ వున్న తీర్థాలు పవిత్రమైనవి. శ్రీవారిని దర్శించుకుని కొండపై గల తీర్థాలను నెత్తిన చల్లుకుంటే చాలు.

తిరుమల వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడు కొండలపై వెలసిన శ్రీవారి ఆలయం.. దాని చుట్టూ వున్న తీర్థాలు పవిత్రమైనవి. శ్రీవారిని దర్శించుకుని కొండపై గల తీర్థాలను నెత్తిన చల్లుకుంటే చాలు.. కోటి జన్మల పాపాలు నశించిపోతాయి. పుణ్యఫలాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. శుభఫలితాలు వెంటవస్తాయి. అలాంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో.. మహాశివుడి ఆలయాన్ని దర్శించుకునే వారికి సమస్త దోషాలు దూరమవుతాయని పండితులు అంటున్నారు. ఆ మహాశివుడే కపిలేశ్వరుడు. ఆ తీర్థమే కపిలతీర్థం. 
 
తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి కిందివైపు మనోహరంగా కన్పిస్తుంటుంది కపిల తీర్థం. వర్షాకాలంలో ఇక్కడకు వస్తే.. జలపాతం కనువిందు చేస్తుంది. కృతయుగంలో కపిల మహర్షి ఈ ప్రాంతంలో ఈశ్వరుని కోసం తపస్సు చేసినట్లు స్థలపురాణం చెప్తుంది. కపిల మహర్షి తపస్సుకు మెచ్చి  పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమికి చీల్చుకుని  ఇక్కడ లింగేశ్వరుడిగా వెలసినట్లు స్థలపురాణం చెప్తోంది. ఇలా కపిలముని తపస్సు కారణంగా కొలువైన ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అనే పేరు సార్థకమైంది. 
 
ఆ తర్వాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు కపిల తీర్థానికి వచ్చి.. ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా అంటారు. ఈ తీర్థంపై భాగాన తిరుమల కొండలు అమరినట్లు కనిపిస్తాయి. ఆ తిరుమల కొండలు నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి ఆకాశగంగ దూకుతుంది. ఆ జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు.
 
ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారని స్థలం పురాణం చెప్తుంది. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలను కూడా ఏర్పాటు చేయడంతో అప్పట్నుంచీ  దీన్ని చక్రతీర్థమని పిలుస్తారు.