శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. తీర్థయాత్ర
  4. »
  5. కథనాలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

కొండపై నిండుగా కొలువైన మాతల్లి కనకదుర్గా నీకు జేజేలు

అయిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింద్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హేశితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసుర మర్థిని రమ్యకపర్థిని శైలసుతే

భక్త జనకోటి చేస్తున్న దేవీస్తోత్ర పాఠాలతో కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆపాదించుకుంటున్నది. శ్రీ కనకదుర్గ దేవాలయాన్ని చేరుకోవడానికి మెట్లు మరియు ఘాట్ రోడ్ సౌకర్యం కలదు. కానీ మహిళలకు, పిల్లలకు కష్టసాధ్యమైన మెట్ల ద్వారా దేవాలయాన్ని చేరుకోడానికి భక్తులు ఇష్టపడతుంటారు. కొందరు ఈ రెండు మార్గాలను వదిలి నేరుగా కొండను ఎక్కి అమ్మవారి సన్నిధిని చేరుకుంటారు. మెట్లపూజలో భాగంగా పసుపు, కుంకుమలతో భక్తులు మెట్లను అలంకరిస్తారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆంధ్రులకు ఆదిదేవతగా ఇంద్రకీలాద్రి పర్వతంపై అవతరించిన కనకదుర్గేశ్వరి తల్లి శతాబ్దాల కాలంగా లక్షలాదిమంది భక్తులను తన సన్నిధికి రప్పించుకుంటున్నది. అమ్మవారి ఆశీస్సులను అందుకునేందుకు సంవత్సరం పొడవునా భక్తులు దేవాలయానికి వస్తుంటారు. ఇక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షల సంఖ్యలో వచ్చే భక్తులు నవరూపాలలో కనిపించే దేవీమాతకు ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటారు.

పవిత్రమైన కృష్ణానదీ జలాలకు చేరువలో, ఇంద్రకీలాద్రి పర్వతంపై అతిపురాతనమైన కనకదుర్గ దేవాలయం నిర్మితమై ఉన్నది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం స్వయంభువుగా వెలసింది. కనుక అత్యంత మహిమాన్వితురాలిగా కనకదుర్గ తల్లి కొలవబడుతున్నది.
WD PhotoWD


ఈ ప్రాంతంలోనే పాండవ మధ్యముడైన అర్జునుడు ఘోరతపస్సును ఒనరించి పరమశివుని నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఇక్కడి దుర్గాదేవి ఆలయాన్ని అర్జునుడు నిర్మించాడని తెలుస్తోంది. అలాగే ఈ దేవాలయాన్ని దర్శించుకున్న ఆది శంకరాచార్యుడు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించడం ద్వారా వేదసహితంగా దుర్గాదేవికి పూజలు నిర్వహించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడని చెప్పబడింది.

WD PhotoWD
పురాణేతిహాసాలను అనుసరించి దేవతలను ప్రసన్నం చేసుకుని వరాలు పొందిన రాక్షసులు, వరగర్వంతో భూమిపై రుషులను హింసించడం ప్రారంభించారు. రాక్షసులను తుదముట్టించేందుకు పార్వతీ దేవి పలు అవతారాలను దాల్చింది. శంభు మరియు నిశంభును సంహరించేందుకు కౌశకిగాను, మహిషాసురుని సంహరించేందుకు మహిషాసుర మర్ధినిగాను, దుర్గమాసురుని తుదముట్టించేందుకు దుర్గగాను పార్వతీ దేవి అవతారమెత్తింది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దుష్టశిక్షణ, శిష్టరక్షణలో భాగంగా తాను వసించేందుకుగాను పర్వతరూపం దాల్చవలసిందిగా తన భక్తుడైన కీలుడుని కనకదుర్గాదేవి కోరింది. తదనుగుణంగా ఏర్పడిన కీలాద్రి దుర్గాదేవి కొలువుండే పర్వతంగా ప్రాచుర్యాన్ని పొందింది. అనంతరం మహిషామర్ధిని అవతారాన్ని దాల్చిన కనకదుర్గ ఎనిమిది హస్తాలలో రకరకాల ఆయుధాలను ధరించి, సింహాన్ని అధిరోహించినదై ఇంద్రకీలాద్రి పర్వతంపై మహిషాసురుని సంహరించింది.

ఆమె పతిదేవుడైన మహాశివుడు సమీపంలోని పర్వతశిలపై జ్యోతిర్లింగంగా అవతరించాడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆ జ్యోతిర్లింగాన్ని మల్లెలతో పూజించిన0దున మహాశివునికి మల్లేశ్వరస్వామి అన్న నామధేయం సంప్రాప్తించింది. ఇంద్రాదిదేవతలు కీలాద్రి పర్వత్రాన్ని దర్శించుకోవడంతో ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి పర్వతం అన్న పేరు బహుళప్రాచుర్యంలోకి వచ్చింది.

సంప్రదాయాన్ని అనుసరించి దేవతలు తమ పతిదేవులకు ఎడమవైపు స్థానంలో ఉంటారు. కానీ ఇక్కడ దుర్గాదేవి పతిదేవునికి కుడివైపున ఉంటుంది. తద్వారా ఇంద్రకీలాద్రి పర్వతంపై శక్తి యొక్క వైభవం ప్రస్ఫుటమవుతున్నది.
WD PhotoWD


నవరాత్రి ఉత్సవాలలో కనకదుర్గా దేవి రోజుకు ఒక అవతారంలో... బాలాత్రిపుర సుందరి, గాయత్రీమాత, అన్నపూర్ణ, మహాలక్ష్మి, సరస్వతి, లలితాత్రిపురసుందరి, దుర్గాదేవి, మహిషాసుర మర్ధిని మరియు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చి భక్తులకు బాసటగా నిలిచి వారి మొక్కులను తీర్చే చల్లని తల్లిగా నీరాజనాలను అందుకుంటుంది.
WD PhotoWD
విజయదశమినాడు ఉత్సవమూర్తులు హంస రూపంలోని పడవపై కృష్ణానదిలో సాగించే తెప్పోత్సవంలో జగన్మాత వైభవాన్ని కనులారా వీక్షించవలసిందే. పదములకు అందని అద్భుతమైన ఘట్టమది.

అమ్మవారి కరుణాకటాక్షవీక్షణాలకోసం దేవాలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతున్నది. దేవస్థానం వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ. 40 కోట్లకు చేరుకున్నది. అనేక శక్తి మహిమలు, శివలీలలు ఇంద్రకీలాద్రి పర్వత ప్రాంతంలోనే చోటుచేసుకున్నాయని పురాణాలు, పవిత్ర గ్రంథాలు పేర్కొంటున్నాయి.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గలగల పారుతున్న కృష్ణవేణి నదీమతల్లి అల్లంతదూరాన ఉండగా భక్తుల పాలిట కొంగుబంగారమై ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనకదుర్గాదేవి తన చల్లని చూపులతో భక్తులను కాపాడుతూ కలియుగంలో వారి కష్టాలను తీర్చే కల్పతరువుగా పూజలను అందుకుంటున్నది.
WD PhotoWD


చేరుకునే మార్గం:
విజయవాడ నగరంలో ప్రధానమైన ప్రాంతంలో గల దేవాలయానికి విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి పది నిమిషాలలో చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌కు విజయవాడ నగరం 275 కి.మీ.ల దూరంలో ఉన్నది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మరియు విమానమార్గం ద్వారా విజయవాడకు చేరుకోవచ్చు.