కేంద్ర బంగారం స్కీమ్‌పై తితిదే అనుమానాలు: గోల్డ్ డిపాజిట్లపై వెనక్కి.. పీఎన్‌బీలోనే..?
పంజాబ్ నేషనల్ బ్యాంకులో తిరుమల వెంకన్న బంగారం డిపాజిట్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి కానుకలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసునికి రోజు రోజుకు బంగారు నిల్వలు పెరిగిపోతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో 5300 కిలోల పసిడి నిల్వ ఉండగా, తాజాగా మరింత బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల శ్రీవారికి భక్తులు నగదు, వస్తువులు, బంగారు ఆభరణాల రూపంలో కానుకలు సమర్పిస్తుంటారు.
గతంలో భక్తులు స్వామి ఆభరణాలు చేయించి సమర్పిస్తుంటారు. హుండీలో వచ్చే బంగారు కానుకలను కరిగించి శుద్ధి చేసి వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలా మొట్టమొదట 2010లో 775 కిలోల బంగారాన్ని ఎస్‌బీఐలో డిపాజిట్ చేసింది. ప్రస్తుతం బంగారం నిల్వలు పెరగడంతో తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1.75 శాతం వడ్డీ ఇచ్చేందుకు ముందుకు రావడంతో 1300 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసేందుకు టీటీడీ ముందుకు వచ్చింది.
అలాగే ఎస్బీఐలో ఉన్న 1000 కేజీల బంగారాన్ని ఏప్రిల్ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకులోనే డిపాజిట్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇదికాకుండా 1400 కేజీల ముడి బంగారాన్ని ఐఓబీకి అప్పగించి శుద్ధి చేశాక తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేయించేలా ఒప్పందం కుదుర్చుకుంది.
ఇంత వరకు బాగానే ఉన్నా కేంద్రం ప్రకటించిన పథకం ద్వారా బంగారం డిపాజిట్‌లపై 2.5 శాతం వడ్డీ లభించే అవకాశం ఉన్నా టీటీడీ అటువైపు మొగ్గుచూపట్లేదు. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన పథకంపై తితిదేకి కొన్ని అనుమానాలుండటంతో.. వాటిపై క్లారిటీ వచ్చాక బంగారు పథకంలో తితిదే బంగారాన్ని డిపాజిట్ చేసే అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది.
