తిరుమల శ్రీవారి చక్రతీర్థం వద్ద దర్శనమిచ్చిన బంగారు బల్లి..!
తిరుమలలో కదిలే బంగారు బల్లి.. కాంచీపురంలో కదలని బంగారు బల్లి!
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో మరో వింత చోటుచేసుకుంది. ఆధ్యాత్మిక అద్భుతాలకు నిలయమైన శ్రీవారి ఆలయంలో చక్రతీర్థం వద్ద గురువారం బంగారు వర్ణంలో ఉన్న ఒక బల్లి భక్తులకు కనిపించి కనువిందు చేసింది.
బంగారు బల్లి కనిపించిందన్న వార్త వినగానే భక్తులు తండోపతండాలుగా అక్కడికి చేరుకుని దానిని చూడటానికి ఎగబడ్డారు. సాధారణంగా బల్లులు తెలుపు, లేత గోధుమ లేదా నలుపు రంగుల్లో కనిపిస్తాయి. వీటికి భిన్నంగా కంచిలో కదలని బల్లి వుంటే.. తిరుమలలో కదిలే బంగారు బల్లిని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.
బంగారు బల్లిని దేవాలయాల్లో ఎందుకు ప్రతిష్టించారంటే.. పూర్వం గౌత మహర్షి శిష్యులు రోజూ గురువుగారి పూజకోసం నీటిని సిద్ధం చేసేవారట. ఓ రోజు వీరు సిద్ధం చేసిన నీటి పాత్రలోంచి బల్లి బయటికి రావటం చూసిన గౌతముడు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన శిష్యుల్ని బల్లులుగా మారమని శాపమిచ్చాడట.
అందుకే ఇరు శిష్యుల్లో ఒకరు బంగారు బల్లిగా, మరొకరు వెండి బల్లిగా మారారని అంటారు. వీరిద్దరికి ఇంద్రుణి ద్వారా శాపవిమోచనమైనట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ ఘటనకు గుర్తుగా ఈ ఆలయంలో బంగారు, వెండి బల్లులను ప్రతిష్టిస్తున్నారు.
