తిరుమల వైభవంపై బాహుబలి వంటి వీడియో: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం
తిరుమల శ్రీనివాసుడి వైభవంపై ఎన్జీసీలో సోమవారం రాత్రి ప్రసారమైన ‘ఇన్‌సైడ్ తిరుమల తిరుపతి’ కార్యక్రమాన్ని దేశవిదేశాల్లోని కోట్లాది మంది భారతీయులు వీక్షించి పులకరించిపోయారు.
ఒక వైపు బాహుబలి 2 కలిగించిన సంచలనం తడి ఇంకా ఆరకముందే మరోవైపు మరో బాహుబలివంటి ప్రయత్నాన్ని నేషనల్ జియాగ్రఫిక్ చానల్ సృష్టించింది. తిరుమల శ్రీనివాసుడి వైభవంపై ఎన్జీసీలో సోమవారం రాత్రి ప్రసారమైన ‘ఇన్‌సైడ్ తిరుమల తిరుపతి’ కార్యక్రమాన్ని దేశవిదేశాల్లోని కోట్లాది మంది భారతీయులు వీక్షించి పులకరించిపోయారు. ఈ ఘనమైన డాక్యుమెంటరీని ప్రఖ్యాత డాక్యుమెంటరీ దర్శకుడు రాజేంద్ర శ్రీవత్స కొండపల్లి చిత్రీకరించడం విశేషం.
నేషనల్ జియాగ్రఫిక్ చానల్ ప్రత్యేక కార్యక్రమం కింద తిరుమల క్షేత్రం పవిత్రత మొదలు.. యాత్రికుల భక్తివిశ్వాసాలను, స్వామివారి కైంకర్యాలను, బ్రహోత్సవ వైభవాన్ని, శ్రీవారి సేవకుల శ్రమను, ఉత్సవ, వాహనాల విశేష అలంకరణలను గొప్పగా 43 నిమిషాల నిడివితో చిత్రీకరించారు.
తిరుమల వైభవంపై డాక్యుమెంటరీకి సంబంధించిన ఆలోచన కొన్ని నెలల క్రితం రాజేంద్రకు వచ్చింది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘‘ఇండియాస్ మెగాకిచెన్స్’లో భాగంగా తిరుమలలో అన్నప్రసాదం కిచెన్ల చిత్రీకరణ కోసం టీటీడీ వారిని కలిశాను. కానీ, ఇక్కడికొచ్చి పరిశీలించి, పరిశోధించాక.. ఆలయం గురించీ పెద్ద కథనం చేయాలని అనిపించింది’’ అని తెలిపారు.
శ్రీవారి కార్యక్రమాలను ఎన్జీసీ తన ప్రసారాలతో అద్భుతంగా ప్రపంచానికి తెలియజేసిందని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు అన్నారు. ఆలయం లోపలికి కెమెరాలు అనుమతించని నేపథ్యంలో.. టీవీ చిత్రీకరణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గర్భాలయ నమూనాను కెమెరా కంటితో ఒడిసిపట్టడం ద్వారా మతపరమైన ప్రొటోకాల్స్‌ను కూడా పాటించినట్టయింది.
తిరుమల గిరుల ఆధ్యాత్మిక సౌరభానికి కళంకం తేకుండా అంతర్జాతీయ ప్రముఖ టీవీ చానెల్ నేషనల్ జియాగ్రఫిక్ చానెల్ తీసిన డాక్యుమెంటరీ అత్యున్నత కళా సాంకేతికతతో అలరారిందని వీక్షకులు కొనియాడుతున్నారు.