ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (09:15 IST)

కరోనా భయంతో గణనీయంగా తగ్గిన శ్రీవారి దర్శనాలు

ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో కరోనా భయం నెలకొంది. పలువురు అర్చకులు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరికి భక్తుల ద్వారా సోకిందని భావిస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా, ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు కూడా తమ టిక్కెట్లను రద్దు చేసుకుంటున్నారు. 
 
దీనికి కారణం కరోనా వైరస్ భయమే. దీనికితోడు తిరుపతిలో లాక్డౌన్ అమల్లోకి రావడం, స్థానికంగా దర్శన టికెట్లు మంజూరు చేయకపోవడంతో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గురువారం 4,834 మంది మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. 
 
వీరిలో 1,589 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ద్వారా రూ.43 లక్షల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను ముందుగా బుక్ చేసుకున్న వారిలోనూ పలువురు దర్శనానికి రావడం లేదని తెలిపారు.
 
ఇకపోతే, రేపు గరుడపంచమి కావడంతో, అధికారులు ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి గరుడపంచమి నాడు, తనకు ఇష్టమైన గరుడ వాహనంపై స్వామివారు తిరు మాఢ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వాల్సివుంది. 
 
అయితే, కరోనా కారణంగా, ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ సేవను ఏకాంతంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఈ వేడుకలు జరుగనున్నాయని అధికారులు వెల్లడించారు.