ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 23 జులై 2020 (23:25 IST)

ఏడుకొండలవాడా? ఏమిటీ వైపరీత్యం? విఐపిలే కాదు.. భక్తులు కూడా లేరు

ఆపద మ్రొక్కుల వాడా అనాద రక్షకా గోవిందా..గోవిందా అంటూ భక్తులు గోవింద నామస్మరణలు చేసుకుంటూ తిరుమలకు వస్తుంటారు. పిల్లలు, పెద్దలు ఇలా అందరూ సకుటుంబ సపరివార సమేతంగా తిరుమల క్షేత్రానికి వస్తుంటారు. ఆ స్వామివారిని దర్సించుకుని వెళుతుంటారు.
 
ఎలాంటి సమస్యలున్నా శ్రీవారిని దర్సించుకుంటే సమసిపోతుందని భక్తుల నమ్మకం. ఆ నమ్మకమే ప్రపచంలో ఏ మూల ఉన్నా భక్తులను తిరుమలకు రప్పిస్తుంది. ఆ స్వామివారిని దర్సించుకునేలా చేస్తుంది. ఇదంతా సరిగ్గా నాలుగు నెలలకు ముందు. కానీ ఇప్పడు కరోనా టైం.
 
తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఎలాగోలా భక్తులను అయితే అనుమతిస్తున్నారు. ప్రతిరోజు ఆఫ్‌లైన్ ద్వారా 3 వేల టిక్కెట్లు, ఆన్ లైన్ ద్వారా 9 వేల టిక్కెట్లను అందిస్తున్నారు. కానీ తిరుపతి కంటైన్మెంట్ జోన్‌లో ఉండడంతో ఆ 3 వేల టిక్కెట్లు కూడా ఆగిపోయాయి. ఇక మిగిలింది ఆన్‌లైన్ లోనే.
 
కానీ ఆన్ లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకు రావడం లేదు. సరిగ్గా నాలుగు రోజుల ముందు వరకు 50 శాతం మంది భక్తులు రాకుంటే ప్రస్తుతం ఆ సంఖ్య మరింత తగ్గిపోయింది. 20 నుంచి 25 శాతం మంది భక్తులు మాత్రమే తిరుమలకు వస్తున్నారు.
 
అయితే ఈ విషయాన్ని టిటిడి అధికారులు మాత్రం బయట పెట్టడం లేదు. బస్సులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్కో బస్సులో ఒకరు, లేకుంటే ఇద్దరు భక్తులు మాత్రమే కనిపిస్తున్నారు. సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్ళే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎప్పుడూ భక్తులతో నిండుగా కనిపించే తిరుమల బోసిపోయి కనిపిస్తోంది. తిరుపతి కాస్త లాక్ డౌన్లో ఉండటంతో స్థానికులు దర్సనానికి వెళ్ళడం లేదు. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతామోనని టిటిడి అధికారులు, స్థానికులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.