శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జులై 2020 (19:32 IST)

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ.. 7,998 మందికి పాజిటివ్

కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తోంది. రోజురోజుకూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయే తప్పితే తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అయితే పెద్ద సంఖ్యలో కరోనా టెస్ట్‌లు చేస్తున్నా.. భారీగానే కేసులు నమోదవుతున్నాయని వైద్య శాఖాధికారులు చెబుతున్నారు. గురువారం నాడు మొత్తం 58,052 మందికి కరోనా పరీక్షలు చేయగా 7,998 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 
 
కాగా గురువారం నమోదైన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో భారీగా 1391 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 1184, అనంతపురంలో 1016 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 904 కేసులు, పశ్చిమ గోదావరిలో 748 కేసులు నమోదయ్యాయి. మొత్తానికి చూస్తే.. కోస్తాంధ్రలో గోదావరి జిల్లాల్లో, గుంటూరు, విశాఖపట్నంలో.. రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి.
 
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 884 మంది మృతి చెందారు. మొత్తానికి చూస్తే.. అటు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. ఇటు మరణాల సంఖ్య భారీగానే ఉండటంతో రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా గోదారి జిల్లాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.