షిర్డీ సాయిబాబా తత్త్వమిదే… భక్తుల బాధలు, వ్యాధులు తనవే...
భక్తి, జ్ఞాన, కర్మ మార్గాలు మూడింటిని మేళవించి, వీటిని ఒకే మార్గంలో ఆచరించడం సాధ్యమని బాబా స్వయంగా తాను ఆచరించి మరీ సామాన్యులకు చూపారు. మత సమన్యయాన్ని ప్రబోధించి, మత సామరస్యాన్ని పెంపొందించి, మతాలలోని లోపాలను సరిదిద్ది , సంఘం ఆచరించాల్సిన సరైన విధానా
భక్తి, జ్ఞాన, కర్మ మార్గాలు మూడింటిని మేళవించి, వీటిని ఒకే మార్గంలో ఆచరించడం సాధ్యమని బాబా స్వయంగా తాను ఆచరించి మరీ సామాన్యులకు చూపారు. మత సమన్యయాన్ని ప్రబోధించి, మత సామరస్యాన్ని పెంపొందించి, మతాలలోని లోపాలను సరిదిద్ది , సంఘం ఆచరించాల్సిన సరైన విధానాన్ని సాయి ప్రబోధించారు. షిర్డీ సాయి భక్తి మార్గాన్ని అనుసరించినప్పటికీ మంత్ర తంత్రాలకు ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఆయన ఎవరికీ ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు. ఏ యోగా మార్గాన్ని ఆయన ఆచరించలేదు.
ఏ ప్రత్యేక పూజా విధానాన్ని ఆయన ప్రతిపాదించలేదు. తిథి, వార, నక్షత్రాలకు బాబా ప్రాధాన్యత ఇవ్వలేదు. ధ్యాన మార్గానికి పట్టం కడుతూనే ప్రేమ, భక్తి భావాలను ప్రోత్సహించారు. ఆత్మజ్ఞాన, సాధన మార్గంలో నడవాలనుకునే వారు విశాల హృదయులై ఉండాలని, ఎల్లప్పుడు ఆత్మను చూసుకోగలిగే శక్తిని సాధన ద్వారా అభివృద్ధి చేసుకోవాలనీ బాబా సూచించారు. ఆత్మజ్ఞాన సాధకుడు అయినప్పటికీ ఇంద్రియ నిగ్రహం అంత తేలిగ్గా అలవడదని, దాన్ని ప్రతినిత్యం సాధనతో అలవర్చుకోవాలనీ తార్కాణాలతో సహా బాబా నిరూపించారు.
గురుశిష్య బంధాన్ని, గురువుకున్న ప్రాధాన్యతను, ధ్యాన సాధన ఆవశ్యకతను బాబా తన బోధనలలో సవివరంగా వివరించారు. సాయిబాబా తన జీవితం ద్వారా చక్కని తత్త్వాన్ని భక్తులకు బోధించారు. ప్రారబ్ద కర్మలతో బాధల్ని అనుభవిస్తున్న మానవుల బాధలన్నిటినీ బాబా స్వీకరించి వాళ్ళను ఆ బాధల నుండి విముక్తులను చేశారని సాయిసచ్చరిత్ర చదివితే అవగతమవుతుంది.
భక్తుల చెడు కర్మలను తానే అనుభవించి అతని కష్టాన్ని తొలగించిన బాబా విధానమే అసలైన మార్గమని ఆయన జీవిత చరిత్రను చూస్తే తెలుస్తుంది. షిర్డీ సాయి తనను నమ్ముకున్న భక్తుల బాధల్ని, ఆకలిని, వ్యాధులను తొలగించారు. భక్తుల బాధలను ఆయన భరించారు. ఇలాంటి మహోన్నత తత్త్వాన్ని ఇలలో బాబా తప్ప మరే గురువు బోధించలేరు.