ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ
ఒక ఓటరు వద్ద ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే వాటిని సరెండర్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఒకే ఓటరు ఒకటికి మించి ఓటరు కార్డులు కలిగివుండటం నేరమని ఈసీ హెచ్చరించింది. ఒకవేళ రెండు, అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఒకదాన్ని మాత్రమే పెట్టుకొని, అదనపు కార్డులను సరెండర్ చేయాలని స్పష్టం చేసింది.
'రెండు ఓటరు కార్డులను కలిగి ఉండటం ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం నేరం. సెక్షన్ 31 కింద వారికి గరిష్ఠంగా ఏడాది శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉండొచ్చు. ఒకవేళ ఎవరి వద్దనైనా రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు ఉంటే ఒకటి మాత్రమే తమ వద్ద ఉంచుకోవాలి' అని ఈసీ అధికారులు వెల్లడించారు.
ఓటరు జాబితాలో రెండు చోట్ల ఓటరుగా ఉన్నట్లయితే.. ఒకచోట తమ పేరును తొలగించాలని కోరుతూ ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లోనూ వెసులుబాటు ఉందన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ మీడియా-పబ్లిసిటీ సెల్ ఛైర్మన్ పవన్ ఖేడాకు రెండు ఓటరు కార్డులున్నాయనే ఫిర్యాదు రావడంతో ఎన్నికల సంఘం ఆయనకు ఇటీవల నోటీసు జారీచేసింది. దీనిపై ఖేడా స్పందిస్తూ.. ఎన్నికల అధికారుల తీరును తప్పుపట్టారు. డిలీట్ చేయాలని గతంలోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించలేదన్నారు.