తిరుమలలో ఘనంగా ముగిసిన పద్మావతి పరిణయోత్సవం
తిరుమలలో మూడురోజుల పాటు కన్నులపండువగా జరిగిన పద్మావతి పరిణయోత్సవం ఘనంగా ముగిసింది. భక్తుల గోవిందనామస్మరణల మధ్య ఈ ఘట్టం జరిగింది. పరిణయోత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు దంతపు పల్లకీపై నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.
రెండో రోజు ఏ విధంగా జరిగిందో అదే విధంగా పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ, పెండ్లి వేడుకలు జరిగిన తరువాత కొలువు జరిగింది. వెంటనే బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. నాదస్వరం కళాకారులు నీలాంబరి, భూపాల మధ్యమావతి రాగాలను పలికించారు. తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య కీర్తనలను వినిపించారు.
వేడుక ముగిసిన తర్వాత స్వామి దేవేరులతో కలిసి వూరేగుతూ ఆలయ ప్రవేశం చేస్తారు. మూడురోజుల పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది. అధిక సంఖ్యలో భక్తులు పరిణయోత్సవంలో పాల్గొన్నారు.