వైకుంఠ ఏకాదశినాడు అలంకరణలతో వెలిగిపోతున్న శ్రీ వేంకటేశ్వరుడు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు, పండ్లతో సర్వాంగసుందరంగగా అలంకరించగా... ఆలయ మహా గోపురంతో పాటు తిరుమలలోని కూడళ్లన్ని విద్యుత్ దీపాలంకరణతో దేదీపమాన్యంగా వెలిగిపోతున్నాయి.
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల కొండను వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శోభాయమానంగా తీర్చిదిద్దింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనం కోసం వస్తున్న భక్తులు నిజంగానే వైకుంఠంలోకి ప్రవేశించామన్నట్లు ఈ ఏట టీటీడీ అలంకరణలు చేసింది.
వివిధ రకాల అరుదైన పుష్పాలతో పాటు పలు రకాల పండ్లతో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు టీటీడి ఉద్యానవణ సిబ్బంది. శ్రీవారి ఆలయ మహా గోపురంతో పాటు ఆలయం లోపల ధ్వజస్తంభాన్ని వివిధ రకాల పుష్పాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు.
వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈ పుష్పాలంకరణ అదనపు ఆకర్షణ. రంగురంగు పుష్పాలతో ఎటుచూసినా పూల తోరణాలు, కట్‌అవుట్లు, బొకేలతో చేసిన అలంకరణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇక వైకుంఠ ద్వారమార్గాన్ని పలు రకాల పుష్పాలతో వైభవోపేతంగా అలంకరించారు.
ఓ వైపు పుష్ప అలంకరణ భక్తులను మంత్రముగ్దులను చేస్తుండగా... విద్యుత్ అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రధాన గోపురంతో పాటు ప్రాకారం, ఆలయం లోపల, వెలుపల, విద్యుత్ దీప వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది.