1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (19:47 IST)

వైకుంఠ ఏకాదశి.. హరిధ్యానంలోకి మరల్చడమే...?

వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది. ఎవరైతే ఈ రోజున వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు మరణానంతరం వైకుంఠ ధామంలో శ్రీహరి పాదాల చెంత చోటు పొందుతారు. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నదీస్నానం అందరికీ సాధ్యం కాదు కాబట్టి, ఇంట్లోనే అయినా తలస్నానం మాత్రం చేయడం మంచిది. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని తోరణాలతో అలంకరించాలి. 
 
వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, ఆయన ప్రతిమను కొలుచుకోవాలి. కొందరి ఇళ్లలో ఈ రోజున విష్ణుమూర్తికి కలశం పెట్టే ఆచారం కూడా కనిపిస్తుంది. పూలతో పాటుగా హరికి ప్రీతిపాత్రమైన తులసీదళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి. ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందంటారు. 
 
ఏకాదశి రోజు రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్నీ అదుపు చేసుకుని... వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం. అందుకనే లౌకికమైన ఆలోచనలు వేటికీ తావివ్వకుండా కేవలం హరినామస్మరణ మీదే మనసుని లగ్నం చేయాలని చెబుతారు. 
 
ఇలా నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసినవారికి ఇహపర శాంతి లభిస్తుందని చెప్పేందుకు ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం సుకేతుడనే రాజు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందాడు కాబట్టి, ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు.