మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 డిశెంబరు 2021 (10:06 IST)

సఫల ఏకాదశి విశిష్టత ఏమిటి?

సఫల ఏకాదశి. ఈ సఫల ఏకాదశి మహాత్మ్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్టతో ఉపవసించి జాగరణ చేసి శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి. ముక్తి లభిస్తుంది. శ్రీ మహా విష్ణువును ఉసిరితోనూ, దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.


సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ, తీర్థం కానీ లేదని చెప్పబడింది. సఫల ఏకాదశి విశిష్టతను చాటిచెప్పే కథను కూడా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. పూర్వము చంపావతి రాజ్యమును మహిష్మంతుడు అనే రాజు పాలిచేవాడు. అతనికి లుంభకుడు అనే కుమారుడుండేవాడు. 

 
లుంభకుడు అధర్మవర్తనుడై జీవిస్తుడటంతో కుమారుడని కూడా చూడకుండా రాజు వానిని రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. లుంభకుడు అడవుల పాలై ఆహారము దొరకక, తన పరిస్థితికి పశ్చాత్తాపపడుతూ మర్రిచెట్టు వద్ద రాత్రంతా గడిపి.. ఏమీ తినకుండా చింతిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. 

 
ఆనాడు ఏకాదశి ఆహారం లభించక ఉపవాసమును అప్రయత్నముగా పాటించడంతో శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెప్తున్నాయి. లుంభకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణాంతరము వైకుంఠానికి చేరుకున్నాడని చెప్పబడింది. 

 
ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని పరమ శివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు పద్మ పురాణం చెబుతోంది. అందుకే ఈ రోజున తెలిసి కానీ తెలియక కానీ ఉపవాస దీక్షను చేస్తే పుణ్య లోకాలను పొందుతారు. వైకుంఠ ప్రాప్తి, ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లు కథలున్నాయి.