శనివారం, 14 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 8 నవంబరు 2021 (09:54 IST)

Nagula Chaviti: ఓం నాగేంద్ర స్వామినే నమః

దీపావళి అమావాస్య తరువాత వచ్చే నాలగవ రోజు.. అంటే కార్తీకశుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగా జరుపుకోవడం మన సంప్రదాయం. మరికొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటుంటారు. నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. 

 
నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమను గానీ, లేదా ఫోటోను గానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందార పూలు - ఎర్రటి పువ్వులు- కనకాంబరములు, నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. నాగుల చవితి పూజను ఒంటిగంట లోపు పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని పెద్దల విశ్వాసం. 

 
స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీపారాధనకు నువ్వుల నూనె వాడాలి. 7 దూది వత్తులు, ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపంతో హారతి ఇచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిసాక నాగేంద్రస్వామి నిత్య పూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి, ముత్తైదువులకు అందజేయాలి.

 
అనంతరం దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలుపోసి పూజ చేయాలి. నాగులచవితి రోజున ఆవు పాలు పుట్టలో పోసి, నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిరి ఉండలు (నువ్వులతో చేస్తారు), అరటిపళ్ళు, తాటి బుర్ర గుజ్జు, తేగలు మున్నగునవి స్వామికి నివేదించాలి. నాగరాజుకు హారతి పట్టడం గాని, వేడి పదార్థాల ఆరగింపు గాని పనికి రాదు. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి.


పాలను పుట్టలో పోస్తూ “నన్నేలు నాగన్న నాకులము నేలు నాకన్న వారల నాయింటి వారల ఆప్తుల మిత్రుల నందరను నేలు పడగ త్రొక్కిన పగ వాడనుకోకూ నడుము త్రొక్కిన నా వాడనుకొనుమూ తోక త్రొక్కిన తొలగుచు పొమ్ము ఇదిగో! నూకనిచ్చెదను మూకను నాకిమ్ము పిల్లల మూకను నాకిమ్ము” అంటూ ఈ విధంగా ప్రార్థిస్తారు. 

 
నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించుకుంటే శుభదాయకం. మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ప్రగాఢ నమ్మకం. చెవిబాధలు, కంటిబాధలు ఉన్నవాళ్ళు చవితి నాడు ఉపవాసం ఉంటే మంచిది. నాగ వస్త్రాలు పుట్టమీద పెట్టి తీసి ధరిస్తే కోరికలు తీరతాయని కూడా కొందరి నమ్మకం.