గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (22:00 IST)

కార్తీకంలో దీపదానం విశిష్టత

కార్తిక మాసం అనగానే శివుడే గుర్తుకువస్తాడు. శైవ క్షేత్రాలలో ఈ వైభవం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దేశమంతటా శివ క్షేత్రాలలో పంచాక్షరీ ఘోష మిన్నంటుతుంది. ఈ మాసంలోని ప్రతి సోమవారమూ శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలకూ అంతు ఉండదు. కార్తిక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. ఈ వ్రతం శివుడికి ప్రీతికరమైనది. 
 
పగలంతా ఉపవాసం ఉండి, భక్తి శ్రద్ధలతో శివ నామస్మరణ, అర్చనలు, పురాణపఠనం, శ్రవణంతో కాలం గడపాలనీ, సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత శివుడికి నివేదించిన ప్రసాదాన్ని ఆరగించాలనీ ఈ వ్రత విధానం చెబుతోంది. కొందరు శివ దీక్ష తీసుకొని, దీక్షావిధులను నలభై రోజులపాటు పాటిస్తారు. ప్రతిరోజూ ఉభయ సంధ్యలలో శివార్చనానంతరం శివుని సన్నిధిలో దీపదానం చేస్తారు.
 
దీక్ష కాలంలో భక్తులు వీలైనంత ఎక్కువ సమయాన్ని ధ్యానంలోనే గడపాలి. వృత్తుల పరంగా జీవితాన్ని సాగిస్తున్నా మనసును ఇతరత్రా వ్యవహారాల మీదకు మళ్ళించకుండా అంతరంగంలోనే తమ దైవాన్ని స్మరిస్తూ ధ్యానం చేయవచ్చన్న మినహాయింపు ఉంది. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, గాణపత్యులు… ఇలా ఏ ఆచారాన్ని పాటించేవారయినా దీప దానం చేయవచ్చునని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
 
"సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ సుఖావహం-దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ" అంటూ దీప దానం చేయాలి. అన్ని విధాలా జ్ఞానాన్ని ఇవ్వగలిగే, సకల సంపదలనూ ప్రసాదించే ఈ దీపాన్ని దానం ఇస్తున్నాను అని భావం.