యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)
యమలోకం అంటే ప్రాణం పోయిన వ్యక్తి మాత్రమే, అది కూడా ఎంతో పాపం చేసిన వ్యక్తి అక్కడికి చేరుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రోడ్లపై, అందునా హైదరాబాద్ నగర రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను నిలుపుదల చేసేందుకు యమధర్మ రాజు యమలోకానికి నాలుగు రోజులు శెలవు పెట్టి వచ్చారు. రోడ్డు భద్రతపై ఆయన అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోడ్డు భద్రతపై అవగాహనలో భాగంగా, కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురవారెడ్డి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
బుధవారం నాడు రసూల్ పుర జంక్షన్ వద్ద యమధర్మరాజు వేషధారణలో వున్న వ్యక్తి చేత వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ప్రాణాలు కోల్పోతారని, అందువల్ల ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని పిలుపునిచ్చారు. భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల ఎంతోమంది క్షతగాత్రులుగా, ప్రాణాలు పోతున్నవారు వున్నారన్నారు. కనుక ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలనీ, కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ఈ నిబంధనలు పాటించి హైదరాబాదును సేఫరాబాదుగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.