గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీకృష్ణాష్టమి
Written By
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (17:56 IST)

శ్రీకృష్ణాష్టమి స్పెషల్.. కొబ్బరి రవ్వ లడ్డూలను ఎలా చేయాలంటే?

శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, జన్మాష్టమి అని కూడా అంటారు. ఈ పండుగను శ్రావణ బహుళ అష్టమినాడు చేసుకుంటారు. కొంతమంది కృష్ణుడు పుట్టినప్పుడు ఉన్న రోహిణి నక్షత్రం ఉన్న రోజున జరుపుకుంటారు. శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం, అర్థరాత్రి కారాగారంలో దేవకీ వసుదేవుల దంపతులకు శ్రీమన్నారాయణుడు కన్నబిడ్డగా పుట్టాడు. 
 
ఆ రోజునే శ్రీకృష్ణాష్టమిని అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ రోజున స్వామిని ప్రార్థించి, గారెలు, బూరెలతో పాటు ఇతరత్రా తీపి పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అలాంటి వాటిల్లో కొబ్బరి రవ్వ లడ్డూలు కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఆ కొబ్బరి రవ్వ లడ్డూలను ఎలా చేయాలో చూద్దాం..  
 
కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ- రెండు కప్పులు
ఎండుకొబ్బరి - ఒక కప్పు 
యాలకుల పొడి- అర టేబుల్ స్పూన్ 
పాలు- అర కప్పు 
నెయ్యి - మూడు స్పూన్లు 
పంచదార పొడి- ఒకటిన్నర కప్పు 
జీడిపప్పు- పావు కప్పు
ఎండుద్రాక్ష - పావు కప్పు 
 
తయారీ విధానం: 
ముందుగా బొంబాయి రవ్వను ఒక పాన్‌లో వేసి ఒక స్పూన్ నెయ్యిని చేర్చి దోరగా వేయించుకోవాలి. అందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఆపై రవ్వ మిశ్రమంలో పంచదార, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి రవ్వలో కలిపాలి. రవ్వ కొంచెం చల్లారాక అందులో మరిగించిన పాలు పోసి ఉండలు చేసుకోవాలి. ఈ కొబ్బరి రవ్వ లడ్డూలను శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్వామిని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు.