కేసీఆర్ ఓడిపోతాడని సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయి : రేవంత్ రెడ్డి
గతంలో చెప్పినట్టే తనపై ఈడీ దాడులు చేసారని.. ఇప్పుడు తనపై భౌతిక దాడులకు కుట్ర జరుగుతోందన్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. పోలీసులతో పాటు ముఠాలతో కేసీఆర్ జట్టు కట్టారు. దాడి చేసి నక్సల్స్ పైన తోసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తన ప్రచారాన్ని అడ్డుకోవాలనే భద్రత కల్పించడం లేదు. భద్రత కల్పించకపోవడంతో కొన్ని పర్యటనలు వాయిదా వేసుకున్నాను. కేసీఆర్ ఓడిపోతాడని సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు.
తనకు ప్రాణాపాయం ఉందని, తగినంత భద్రతను కల్పించాలని కోరుతూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు రేవంత్ రెడ్డి. తనకు భద్రత కల్పించాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేసిందని చెప్పారు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు.