కేసీఆర్ అంటే.. కావో కమిషన్ రావు : రాహుల్ సెటైర్లు
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదనీ, కావో కమిషన్ రావు అని, తెరాస అంటే తెలంగాణ రాష్ట్రీయ సంఘ్‌పరివార్ అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలోభాగంగా ఆయన బుధ, గురువారాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అంటే కావో కమిషన్ రావు అని అభివర్ణించారు.
'మిషన్ భగీరథ' పేరిట రాష్ట్ర నిధులను దుర్వినియోగం చేశారని, రాష్ట్ర సంపదను తన కుటుంబం కోసం కేసీఆర్ వెచ్చిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2.50 లక్షల కోట్ల మేరకు అప్పులు చేశారని, రైతు సమస్యలను పట్టించుకోవట్లేదని విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలోని పసుపు రైతులకు మేలు చేస్తామన్నారు. గిట్టుబాటు ధర రూ.10 వేలు కల్పిస్తామన్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్‍కు పసుపు బోర్డు తీసుకొస్తామన్నారు. ఇంతవరకూ ఆ బోర్డును వారు తీసుకురాలేకపోయారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి బీడీ కార్మికులు, యాజమాన్యాలు తనను కలిశారని, వారి సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని, బీడీ కార్మికులు, యాజమాన్యాలపై జీఎస్టీ భారం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.