ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్.. ఇద్దరూ ఒక్కరే: రాహుల్ గాంధీ
తెలంగాణలో ప్రతి వ్యక్తిపై అప్పు వుంటే.. ఆపద్ధర్మ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ఆదాయం మాత్రం నాలుగు వందల రెట్లు పెరిగిందని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ ఎన్ని ఇచ్చాడో ఆలోచించాలని... కేసీఆర్ కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని రాహుల్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటుతో కష్టాలు తీరుతాయని ప్రజలు భావించారు.
కానీ తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రతి యువకుడు నిరాశ, అసంతృప్తితో ఉన్నాడని.. రాహుల్ గాంధీ తెలిపారు. కొడంగల్‌లో తనకు కాంగ్రెస్ గెలుపు కనిపిస్తోందని, తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని.. కేసీఆర్‌ను ఖండించడం ఖాయమని తెలుస్తోందని చెప్పారు. రూ.17వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణ.. ప్రస్తుతం రెండు లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు.
ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇద్దరూ ఒక్కరేనని మోదీకి అవసరమైనప్పుడు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్ అని ఎద్దేవా చేశారు. మోదీ.. మైనార్టీ, దళిత, గిరిజన వ్యతిరేకి అని రాహుల్ అన్నారు. అలాంటి మోదీని సమర్థించే కేసీఆర్‌ను ఏమనాలని ప్రశ్నించారు.